మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో మరో పాట విడుదలైంది. ఇంతకుముందు లాహే లాహే, నీలాంబరి పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈసారి రెజీనా కసాండ్రా, చిరంజీవిల మీద వచ్చే ఈ పాట ఐటమ్ సాంగ్ మాదిరిలానే ఉంది. భాస్కర్ భట్ల రవి కుమార్ ఈ పాట రాశారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కావలసి ఉంది. కొన్ని సినిమాల విడుల వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆచార్య సినిమా ముందు ప్రకటించిన ప్రకారం విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఐటమ్ సాంగ్ ను రేవంత్, గీతా మాధురి ఆలపించగా ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులను సమకూర్చారు. కల్లోలం కల్లోలం ఊరూ వాడా కల్లోలం.. నేనొస్తే అల్ల కల్లోలం’ అంటూ పాట మొదలవగానే రాంగోపాల్ వర్మ రంగీలా సినిమాలోని యాయిరే పాట గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత పల్లవి కొంత మారినా రంగీలా పాటను మాత్రం మణిశర్మ గుర్తు చేశారు. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ.. అంటించకే అందాల అగరొత్తిని.. నాన్నయ్య తీయించేయ్ నరదిష్టిని’ అంటూ పాట కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ పాటను విడుదల చేశారు. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి ఆచార్యగా, ఆయన శిష్యుడు సిద్ధగా రామ్ చరణ్ ఇందులో నటిస్తున్నారు. ఈ రోజు ఈ పాట విడుదలైన విధానం చూస్తుంటే సినిమా విడుదల వాయిదా పడకపోవచ్చని అనిపిస్తోంది. ఇక నుంచి మిగిలిన పాటల్ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాకి నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావలసి ఉంది. ఈలోపే మిగిలిన పాటల్ని విడుదల చేయడం, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరగాలి. అదే తేదీకి సినిమా విడుదలైతే మాత్రం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి.











