మెగాస్టార్ ‘ఆచార్య’ ప్రోగ్రెస్ ఒక అడుగు ముందుకు పడితే రెండడుగులు వెనక్కు వెళుతోంది. అసలు ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని మెగాస్టార్ చిరంజీవి సంకల్పించారు. గత ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరై త్వరగా ఈ సినిమా పూర్తిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఆ సినిమా గత ఏడాది మేలోనే విడుదల కావాలి. కరోనా పుణ్యమా అని షూటింగ్ వాయిదా పడిపోయింది. ఆ తర్వాత ఈ సినిమా కథ తనదేనంటూ ఓ కోడైరెక్టర్ మీడియాకెక్కారు.
దర్శకుడు కొరటాల శివ తన కథతోనే ఈ సినిమా రూపొందిస్తున్నారన్నది ఆ వివాదం సారాంశం. ఆ వివాదంపై మెగాస్టార్ స్పందించకపోయినా వివాదం సమసిపోయినట్టే ఉంది. ఆ తర్వాత మెగాస్టార్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. కొత్తగా ఇందులో రామ్ చరణ్ కూడా యాడ్ అయ్యారు. తండ్రీ కొడుకులు నటించడం వల్ల ఈ సినిమా మీద అంచనాలు కూడా రెట్టింపయ్యాయి. విడుదల తేదీ మార్చి 13గా ప్రకటించారు. ఇప్పుడు ఈ తేదీ మీద కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దానికి కారణం కరోనా సెకండ్ వేవ్ ఒకటైతే, ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా మిగిలి ఉండటం. విడుదల జూన్ కి వాయిదా పడొచ్చన్న మాట కూడా వినిపిస్తోంది.
అదలా ఉంచితే ఊహించని మరో షాక్ కూడా ఎదురైంది. ఆచార్య, విరాటపర్వం చిత్రాల్లో నక్సలిజానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో నక్సలైట్లను మంచి వాళ్లుగా చూపించే సన్నివేశాలు ఉంటే ఈ సినిమాలను సెన్సార్ చేయవద్దని యాంటీ టెర్రరిజం ఫోరమ్ రంగంలోకి దిగింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డును కోరింది. ఈ నెలాఖరుకు విరాటపర్వం విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాల్లో నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉంది. కచ్చితంగా నక్సలైట్లను మంచి వారుగా చూపే ప్రయత్నం కూడా ఉంటుంది. మున్ముందు కూడా ఈ తరహా చిత్రాలను అడ్డుకోవాలని యాంటీ టెర్రరిజం ఫోరమ్ సభ్యులు కోరుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ ఉంటుందన్న వదంతులు ఓ పక్క వినిపిస్తున్నాయి. పైగా ‘ఆచార్య’ విడుదల జూన్ కి వాయిదా పడితే ఆ సమయంలో థియేటర్ల సమస్య కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆ నెలలో విడుదలయ్యే స్టార్ హీరోల సినిమాలు అయితే లేవుగానీ చిన్న సినిమాల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే మెగాస్టార్ మేనల్లుడి చిత్రం ‘రిపబ్లిక్’ అడ్డం వస్తుంది. గుడ్ లక్ సఖి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తదితర చిత్రాలన్నీ జూన్ లోనే విడుదల కాబోతున్నాయి. మరి ఈ కష్టాలనన్నిటినీ దాటుకుని ఆచార్య ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
Must Read ;- ‘కింగ్ మేకర్’ గా మెగాస్టార్ చిరంజీవి ?