దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోనే 72 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 459 మంది మృత్యువాత పడ్డారు. ఈ గణాంకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ తప్పదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 11 లక్షల 25 వేల 681 మందికి కోవిడ్ నిర్దారణ టెస్టులు నిర్వహించగా 72,330 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో కరోనా రెచ్చిపోతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంతోపాటు, మరణాలు కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా గణాంకాలను పరిశీలిస్తే గడచిన ఆరు నెలల కాలంలోనే అత్యధిక కేసులు గడచిన 24 గంటల్లో నమోదవడం కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం..
తెలంగాణ, ఏపీల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో నిన్న ఒక్క రోజే 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 337 మంది కోలుకోగా, నలుగురు చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం 5,551 యాక్టివ్ కేసులు ఉండగా, 2166 మందిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు అన్నీ మూసివేశారు. కరోనా కేసులు ఇదే వేగంతో పెరుగుతూ పోతే లాక్ డౌన్ తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పోలీసులు కొన్ని ప్రాంతాలను కంటెయిన్ మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి రాకపోకలు నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 201 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గురువారం నాటికి 887కు పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
గ్రేటర్ హైరదాబాద్ తరవాత మేడ్చల్ జిల్లాలో 79, నిర్మల్ జిల్లాలో 78, రంగారెడ్డిలో 76, జగిత్యాలలో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభమయ్యాక తెలంగాణలో 3 లక్షల 8876 మంది కరోనా భారిన పడ్డారు. వారిలో 3 లక్షల 1564 మంది కోలుకున్నారు. 1701 మంది మృత్యువాతపడ్డారు. కరోనా ఉధృతిని గుర్తించేందుకు తెలంగాణలో పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. నిన్న ఒక్క రోజే 59,297 కోవిడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఏపీలో లాక్ డౌన్..
కరోనా కల్లోలంతో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలులో ఒకే రోజు 78 కేసులు నమోదు కావడంతో అక్కడ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. గడచిన 24 గంటల్లోనే 1184 కేసులు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఒక్క రోజులోనే 352 కేసులు నమోదు కాగా, విశాఖ 186, చిత్తూరు 115, కృష్ణా జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 78, అనంతపురం జిల్లాలో 66 , కర్నూలు లో 64, కడపలో 62, శ్రీకాకుళంలో 47 ప్రకాశం జిల్లాలో 45, తూర్పుగోదావరి జిల్లాలో 26, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో 9 లక్షల 1989 మంది కరోనా భారిపడ్డారు. వారిలో 7,217 మంది చనిపోయారు. తాజాగా గురువారం నాడు నలుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ఏపీలో కోటి 50 లక్షల కరోనా టెస్టులు నిర్వహించగా, 9 లక్షల మంది కరోనా బారిన పడ్డారు.
లాక్ డౌన్ తప్పదా..
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనే విజృంభిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని చాలా నగరాల్లో లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇక ఏపీలోని గుంటూరు జిల్లా భట్టిప్రోలులో వారం రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోనూ అంక్షలు మొదలయ్యాయి. ఇదే వేగంతో కరోనా వ్యాప్తిస్తే మరోసారి పూర్తి లాక్ డౌన్ తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే కరోనా టీకా ఇచ్చే కార్యక్రమం కూడా వేగవంతం చేశారు. నమోదు చేసుకునే పనిలేకుండానే 45 సంవత్సరాలు దాటిన ప్రతివారు కరోనా టీకా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. తెలంగాణలో రోజుకు లక్ష మందికి కరోనా టీకా వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏపీలో నెల రోజుల్లో కోటి మందికి టీకా వేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒ వైపు కరోనా టీకా వేసే కార్యక్రమం వేగవంతం చేయడంతోపాటు, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే జనం మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని వైద్య అధికారులు చెబుతున్నారు.