హైదరాబాద్‌లో కొత్తగా భవనాలు నిర్మించే భవన యజమానులు, నిర్మాణదారుల నుంచి డబ్బు కోసం ఏ నాయకులైనా బెదిరింపులకు పాల్పడితే వారిపై టాడా చట్టం నమోదు చేసి జైల్లో పెడతామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గోషామహల్ నియోజకవర్గంలో కొంత మంది నాయకులు భవన నిర్మాణ దారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇతర పార్టీలకు చెందిన వారే కాకుండా సొంత పార్టీ నాయకులైనా సరే ఎవ్వరినీ వదిలేది లేదని ఆయన తేల్చి చెప్పారు. గురువారం తలసాని హైదరాబాద్‌లో మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడినట్లు తెలిసింది.
అంతకుముందు దేవాదాయ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో కార్పొరేటర్లు, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఎవరైనా నాయకులు నిర్మాణ దారులను బెదిరిస్తే భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మంత్రి ప్రజలకు మంత్రి సూచించారు. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి అధికారులతో చర్చించారు. గోశామహల్ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి రినోవేషన్ కమిటీని వేసి అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
లంచావతారం ఎత్తుతున్న కార్పొరేటర్లు..
కొంత మంది కార్పొరేటర్లు నగరంలో లంచావతారం ఎత్తుతున్నారనే విమర్శ జనాల్లో ఉంది. లంచాలు అడుగుతూ బయటపడిన వీడియోలు, ఆడియో టేపులు గతంలో చాలానే చూశాం, విన్నాం కూడా. నూతనంగా ఇళ్లు, బహుళ అంతస్తుల భవనం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కడుతున్నట్లు కనబడితే చాలూ అక్కడ డబ్బుల కోసం గద్దల్లా వాలుతారనే ఆరోపణ కొందరిపై ఉంది. వారు అడిగిన మొత్తం ఇవ్వకుంటే నిర్మాణ పనుల్లో ఆటంకం కలిగించేలా చర్యలు చేపడతారనే భావన ప్రజల్లో ఉంది. అందుకే కొంతమంది నిర్మాణాదారులు… అసలెందుకొచ్చిన గొడవ అన్నట్లుగా వారు అడిగినంత మొత్తం ఇచ్చేస్తున్నారు.
హల్చల్ అయిన కార్పొరేటర్ సంభాషణ..
తాజగా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్ డివిజన్‌లో ఓ నిర్మాణదారుడి నుంచి ఒక కార్పొరేటర్ లంచం తీసుకున్న సంభాషణ కలకలం రేపింది. ఆ మహిళా కార్పొరేటర్ రూ.20 వేలు తీసుకున్నట్లు, ఇతర నిర్మాణదారులను కూడా డబ్బులు అడిగినట్లు స్వయంగా తన భర్తకే ఫోన్‌లో చెప్పిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయిన కార్పొరేటర్ తన భర్తతో మాట్లాడిన ఆ ఫోన్ సంభాషణ ఇలా ఉంది.‘‘ఓ నిర్మాణదారుడికి ఫోన్ చేశాను. ప్లాన్ ప్రకారం భవనం కడుతున్నామని, జీహెచ్‌ఎంసీ అధికారులందరికీ ఇచ్చాం కనుక, ఇక ఎవరికీ ఇచ్చేది లేదని చెప్పారు. నేను రూ.50 వేలు అడిగాను. రూ.20 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. మిగతా డబ్బులు మా సార్‌ను అడిగి చెబుతానని నిర్మాణదారుడు చెప్పాడు” అని ఆ కార్పొరేటర్ తన భర్తతో ఫోన్ సంభాషించింది. ఈ సంభాషణ భార్యాభర్తల మధ్యే జరిగినప్పటికీ ఫోన్ నుంచి ఇతర గ్రూప్‌లలోకి వెళ్లడం కలకలం రేపింది. భవన నిర్మాణ యాజమాన్యాల నుంచి డబ్బులు వసూలు చేసే అంశంపై తాజాగా మంత్రి తలసాని నాయకులకు హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే సొంతపార్టీనా.. ఇతర పార్టీనా అని చూడకుండా డబ్బులు వసూళ్లకు పాల్పడే వారిపై ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి మరీ.











