సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్ర నిర్మాణంలో చురుకుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా తను నిర్మించే చిత్రాల్లో నటిస్తూ ఉన్నాడు. ఈసారి తాను నటించకుండా చిత్రం నిర్మించే పనిలో ఉన్నాడు. ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాణంలోనూ ఆయనకు భాగస్వామ్యం ఉంది. అంటే అందులో నటించడం ద్వారా ఆయన పారితోషికం తీసుకోవడంతోపాటు లాభాల్లో వాటా ఉంటుంది. తాజాగా ఆయన మేజర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం. ఈ సినిమా ముంబయి పేలుళ్లు, కాల్పుల ఘటనల నేపథ్యం ఉన్న కథాంశంలోని ఓ వాస్తవ పాత్ర ఆధారంగా తెరకెక్కబోతోంది.
26/11 కాల్పుల ఘటనలో అమరురాలైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇంతకీ ఈ సినిమాలో హీరో పాత్ర నామమాత్రమే. హీరోయిన్ మాత్రం దర్శకనటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్. ఇంతకుముందు ‘దబాంగ్ 3’ లో కూడా ఆమె నటించింది. ఇందులో మన ‘గూఢచారి’ హీరో అడవి శేషు ఓ ప్రత్యేక పాత్రను పోషించనున్నాడు. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్కా దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా విశేషాలతో అడవి శేష్ ఈరోజు ట్వీట్ చేశారు. ‘సోనీ పిక్చర్స్’ సహకారంతో మహేశ్ జీఎంబీ ‘ఎ ప్లస్ ఎస్’ సంయుక్త నిర్మాణంలో ‘మేజర్’ సెట్స్ పైకి వెళ్లనుంది. శోభిత దూళిపాళ కూడా ఇందులో ఓ కీలక పాత్రను పోషించనున్నారు.











