నాగార్జున కథానాయకుడిగా ‘వైల్డ్ డాగ్‘ సినిమా పూర్తయింది. సరైన విడుదల సమయం కోసం ఈ సినిమా ఎదురు చూస్తోంది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే నాగార్జున తన మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో నడిచే ఈ సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగు జరుపుకోనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
మొదటి నుంచి కూడా ప్రవీణ్ సత్తారు విభిన్నమైన కథలనే ఎంచుకుంటూ వచ్చాడు. ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతూనే వచ్చిన ఆయన, ‘గరుడ వేగ‘ సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. టేకింగ్ పరంగా ఆయనకి ఈ సినిమా మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొన్ని కథలపై కసరత్తు చేస్తూ వచ్చిన ఆయన, నాగార్జునతో కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. సస్పెన్స్ తో కలిసి నడిచే యాక్షన్ సినిమా ఇది. నాగార్జున ఈ సినిమాలో డిటెక్టివ్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో నాగార్జున చెల్లెలి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్ర కోసం ‘గుల్ పనాగ్’ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఎక్కువగా హిందీ సినిమాలు చేసిన ఆమె, అడపాదడపా పంజాబ్ సినిమాల్లోను మెరిసింది. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయినా ఈ చండీఘర్ భామ, ఎంతో సహజంగా నటిస్తుందని చెబుతున్నారు. ఈ పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే ఆమెను తీసుకున్నారని అంటున్నారు. ఆమె పాత్ర కారణంగానే కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుందని చెబుతున్నారు.
ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ కూడా వేశారట. చాలావరకూ ఆ సెట్లోనే షూటింగు జరుగుతుందని అంటున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడని అంటున్నారు. కెరియర్ పరంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఆయనకి సరైన రోల్ పడలేదనే విషయం అర్థమవుతుంది. ఈ సినిమాలోని రోల్ పట్ల నాగ్ సంతృప్తితో ఉన్నాడని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా థియేటర్లకు రానుంది.
Must Read ;- నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ ఎలా ఉండబోతోందో?