‘గద్దలకొండ గణేశ్’ హిట్ తరువాత వరుణ్ తేజ్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని‘ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ తరువాత ఆయన ‘ఎఫ్ 3’ సీక్వెల్ షూటింగులో పాల్గొననున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆల్రెడీ ఈ సినిమా షూటింగు జరుపుకుంటూనే ఉంది. ఈ రెండు జోనర్లు విభిన్నమైనవే. ఒకదాంట్లో వరుణ్ తేజ్ యాక్షన్ హీరోగా చెలరేగిపోతే, మరోదాంట్లో పడిపడి నవ్విస్తాడు. ‘గని’ జూలై 30న .. ‘ఎఫ్ 3‘ ఆగస్టు 27న విడుదల కానున్నాయి.
ఇక ఆ తరువాత ప్రాజెక్టును కూడా వరుణ్ తేజ్ లైన్లో పెట్టేశాడని తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు పేరు వినిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు అనగానే ‘చందమామ కథలు’ .. ‘గుంటూర్ టాకీస్’ సినిమాలు గుర్తుకువస్తాయి. ముఖ్యంగా ఆయన రూపొందించిన ‘గరుడ వేగ’ ప్రేక్షకుల కళ్లముందు కదలాడుతుంది. ఫ్లాపులతో సతమతమవుతున్న రాజశేఖర్ తేలికగా ఊపిరి తీసుకునేలా చేసిన సినిమా ఇది. దాంతో ప్రవీణ్ సత్తారు నుంచి వరుస సినిమాలు వస్తాయని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. కారణమేమిటనేది తెలియదుగానీ గ్యాప్ వచ్చేసింది.
రీసెంట్ గా వరుణ్ తేజ్ ను కలిసిన ప్రవీణ్ సత్తారు ఆయనకి ఒక కథ చెప్పాడట. కథ .. తన పాత్ర కొత్తగా ఉండటంతో వరుణ్ తేజ్ ఓకే చెప్పాడని అంటున్నారు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగు అంతా కూడా యూకేలో జరుగుతుందట. భోగవల్లి ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ రోజున ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను కూడా ఇదే ఏడాది థియేటర్లకు తీసుకురావొచ్చు.
Must Read ;- వరుణ్ తేజ్‘గని’ లో కన్నడ స్టార్ హీరో