రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టింగులకు సీట్లు లేవని ఓవైపు చెప్పకనే చెప్తుంటే వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి నేనే పోటీ చేస్తానని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తేల్చి చెప్పారు. తన మీద నాకే అసంతృప్తిగా ఉందని.. ఎమ్మెల్యేగా తాను రాప్తాడుకి ఎంతో చేయాలనుకున్నప్పటికీ చేయలేకపోయానని అన్నారు. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కల్పించిన మూడు లక్షల కోట్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. దీంతో అభివృద్ధి చేయలేకపోయానని అన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి గెలిచాక మరింత అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే తోపుదుర్తి చెప్పిన ఈ మాటలను బట్టి.. ఆయన తన ప్రాంతానికి ఏమీ చేయలేదని ఒప్పుకున్నట్లేనని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. పైగా తన చేతగానితనాన్ని చంద్రబాబు పైకి తోశారు. రాప్తాడు అభివృద్ధి చేయలేకపోవడానికి.. చంద్రబాబు వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులని చెప్పడం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారు. పైగా ఇప్పటిదాకా కానీ అభివృద్ధి ఇకపై చేస్తానని చెప్పడాన్ని కూడా నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదు.
పైగా ఇంకొన్ని డాబు మాటలు కూడా మాట్లాడారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి వందేళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి రాజకీయాలు చేస్తున్నానని.. తాను మట్టిలో కలిసేంతవరకు రాప్తాడులోనే ఉంటానని అన్నారు. రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నానని.. రాప్తాడు నియోజకవర్గం వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఆయన ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినప్పటికీ.. తన సొంత ఊరికి కూడా రోడ్డు వేయలేదని నియోజకవర్గం మొత్తం ఎగతాళి చేస్తున్నారు.
నిజానికి జగన్ తయారు చేసుకున్న 60 మంది టికెట్ దక్కని ఎమ్మెల్యేల జాబితాలో రాప్తాడు సీటు కూడా ఉందని సమాచారం. అందుకే ఆ అనుమానంతో తోపుదుర్తి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే జగన్ వచ్చే ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డికి వైసీపీ నుంచి టికెట్ ఇవ్వకపోతే.. నియోజకవర్గంలో ఆయన్ని పట్టించుకునే వారే ఉండరు. ఏ పనులు చేయలేదని ప్రజల్లో తనపై పుట్టెడు వ్యతిరేకత ఉందని తనకు కూడా తెలుసు. ఎలాగూ ఓడిపోతున్నానని కుటుంబంతో కలిసి సెంటిమెంట్ రాజకీయాలు చేయడంతో ఈయన దిట్ట. గత ఎన్నికల్లో కూడా ఇలా సానుభూతి పొందే ఓట్లు పొందారు. కానీ ఆయన ఈ ఐదేళ్లలో ఒక్క పని కూడా చేయని తనకు.. ఇక ఎంత ఓవరాక్షన్ చేసినా ఫలితం ఉండదు.
నిజానికి ఏ ఎమ్మెల్యే కూడా నిజంగా ఏ పనులు చేయకపోయినా ఇలా బహిరంగంగా చెప్పుకోరు. కానీ, ఈయన మాత్రం సానుభూతి పొందేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇంతకుముందు కూడా ఓసారి నా సొంత డబ్బులు పెట్టి సొంతూరు తోపుదుర్తికి రోడ్డేస్తానని ప్రకటించారు. ఆ ఊరి చెరువును కూడా సొంత డబ్బులతో బాగు చేస్తానని చెప్పుకొచ్చారు. అంతా ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాప్తాడులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని గెలిచే సూచనలు కనిపించడం లేదని అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి అర్థం అవుతోంది.