ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారంలో సీఎం జగన్ కు, దర్యాప్తు సంస్థకు ఇటీవలి రోజుల్లోనే రెండోసారి నోటీసులు జారీ చేసింది. జగన్ కేసుల విషయంలో మాజీ ఎంపీ, కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, అప్పటిలోగా ఏదోఒకటి తేల్చాలని హరిరామ జోగయ్య పిల్ లో కోరారు. ఏపీ ప్రజలు నేర చరిత్ర లేని నాయకుడ్ని తమ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాని పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే, ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేయగా.. జగన్ కు, సీబీఐ, ఈడీలకు మరోసారి నోటీసులు ఇచ్చింది. గతంలో జారీచేసిన నోటీసులు అందకపోవడంతో మళ్లీ నోటీసులు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకి ఈ పిటిషన్ రాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపించారు. వైఎస్ జగన్‌కు చెందిన ఇంకా 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు వాదించారు. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీచేస్తున్నప్పటికీ వారి తరపున న్యాయవాదుల ఎవరూ హాజరుకాలేదని చెప్పారు. కోర్టు పర్మిషన్ ఇస్తే నోటీసులు వ్యక్తిగతంగా అందజేస్తానని చెప్పగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్‌ను, జగన్ కేసులపై దాఖలైన పిల్‌తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటోగా తీసుకున్న పిటిషన్‌తో పాటు 3 నెలల తర్వాత దీనిపై విచారణ చేపడతామని వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ చేపట్టిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి అధికారాన్ని వాడుకొని అప్పట్లో ఎంపీగా ఉన్న జగన్ అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారనేవి ఆరోపణలు. దీనిపైనే సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు ప్రముఖ వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ రిపోర్టులో 58 కంపెనీలు, 13 మంది వ్యక్తుల పేర్లను నమోదు చేసింది. అలా 2012 ఏడాదిలో మే 27న సీబీఐ జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు వైఎస్ జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్ 2న సీబీఐ ప్రత్యేక కోర్టు కండీషనల్ బెయిల్ ఇవ్వడంతో ఆ తర్వాతి నుంచి బయటికి వచ్చారు. ఆ సానుభూతినే పాదయాత్రలో వాడుకొని ఎన్నికల్లో బాగా ఉపయోగించుకున్నారు.