ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు విపక్షాలు నయా ప్లాన్ సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను నిలువరించేందుకు వారు ఇచ్చిన హామీలే టార్గెట్ గా పని చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే విమర్శనాస్త్రాలవుతున్నాయి. యువతను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ చేసిన ప్రమాణాలను విపక్షాలు తిరిగి తోడుతున్నాయి. యువతను ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్న దానిపై నే ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం యువకులను మోసం చేస్తోందని .. కేవలం మాటలే తప్ప చేతలు ఏమీ లేకుండా పబ్బం గడుపుతోందని విమర్శిస్తున్నాయి.
లక్షల ఉద్యోగాలు ప్రధానాస్త్రాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పిన టీఆర్ఎస్ ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలంటూ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. ఇక కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామంటూ ప్రకటనలు చేసిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏమయ్యారంటున్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా గెలిచేందుకే టీఆరెస్ నేతలు ప్రకటనలు , ప్రమాణాలు చేసి ఆ తరువాత మొహం చాటేస్తున్నారంటూ విస్తృతంగా ఓటర్లను ప్రభావితం చేసి టీఆర్ఎస్‌కు దూరం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆరేళ్ళుగా తెలంగాణలో యువకులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని.. అరకొర నోటిఫికేషన్లు విడుదల చేసి ఆ తరువాత అవి కోర్టు మెట్లెక్కి వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్న విమర్శలు టీఆర్ఎస్ సర్కార్ పై ఉన్నాయి. ఇవే ప్రధానాస్త్రాలుగా ఎన్నికల బరిలో దిగుతున్నారు ప్రత్యర్థులు.
హామీలతో మోసం
ప్రజలను హామీలతో మోసం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని… యువత , విద్యావంతులే తమ బలం అని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ వారికి ఒరగబెట్టిందేమీ లేదని చెబుతున్నారు విపక్ష పార్టీల నేతలు. ఉద్యమ పార్టీగా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు రాజకీయ పార్టీగా ప్రకటించుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు నిజంగానే రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. యువకులు ఇప్పటికైనా టీఆర్ఎస్ మాటలు నమ్మి మోసపోకూడదని .. ఒక సారి తమకు కూడా సేవ చేసే అవకాశం ఇవ్వాలని విపక్ష పార్టీల నేతలు కోరుతున్నారు. తాము కూడా తెలంగాణ కోసం పోరాడామని… అవకాశమిస్తే ప్రజల ఆకాంక్ష నేరవేర్చడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను తీసుకుంటామంటున్నారు.