టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ మరో పథకం వేసింది. ఇన్నాళ్ళూ తాను ఏది చేసినా తిరుగుండదని భావిస్తూ వచ్చిన టీఆర్ఎస్ కు ప్రస్తుత బీజేపీ వ్యవహారాలు మింగుడు పడడం లేదు. ఏం చేసైనా టీఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు సిద్ధమైన బీజేపీ నేతలు టీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలే టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సమస్యలపై ఇప్పటికే మిగతా పార్టీల కంటే ముందే బీజేపీ కార్యక్రమాలు చేపడుతోంది. వరద ప్రాంతాల్లో పర్యటనలు, నీట మునిగిన పంటల పరిశీలన ఇలా ప్రజల మధ్యకు వెళ్ళేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. టీఆర్ఎస్ చేపడుతున్న పథకాలే టార్గెట్ గా ఆ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. జైలుకు వెళ్ళేందుకైనా సిద్ధమని చెబుతున్న ఆ పార్టీ నేతలు తెలంగాణలో పార్టీ ని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటామంటున్నారు. పార్టీని ప్రజల్లో నిలపడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు కదులుతున్నాయి.
బీజేపీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
తాజాగా ఇదే అంశంపై టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ . గ్రేటర్ హైదరాబాద్ లో వరద ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు తక్షణ సాయం కింద పదివేల రూపాయలు పంచిపెడుతోంది టీఆర్ఎస్ సర్కార్. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వరద సాయంలో రాష్ట్ర సర్కార్ చేపడుతున్న కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సాయం ప్రజలకు చేరే విధంగా చూడాలన్నారు. ఆయన పిలుపులో వేరే ఆంతర్యం ఉందంటున్నారు.
వరదల కారణంగా రాష్ట్రం రూ.5 వేల కోట్లు నష్టపోయిందని.. తక్షణ సాయం కింద రూ.1300 కోట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఆ వెంటనే ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సాయం కింద కుటుంబానికి 10 వేల రూపాయల సాయం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కేంద్ర సాయం రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నుండి నిధులు ఇస్తుందన్న ప్రశ్నలు తలెత్తాయి.
ప్రతి రాష్ట్రానికి కేంద్రం డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్ కింద కొంత మొత్తం డిపాజిట్ చేసి ఉంచుతుంది. అత్యవసర సమయంలో రాష్ట్రాలు ఆ నిధులు వాడుకునే వెసులు బాటు కల్పిస్తారు. ఆ ఫండ్ నే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఫండ్ వినియోగిస్తూ టీఆర్ఎస్ సర్కార్ తానేదో చేస్తున్నానని బిల్డప్ ఇస్తోందని , ఆ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు బీజేపీ ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఘర్షణలతో పోలీసుల రంగ ప్రవేశం
మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ వరద సాయం చేసే ప్రాంతాల్లో బీజేపీ నేతలు సైతం పాల్గొంటున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలను తమ వెంట రావద్దంటూ సూచిస్తున్నారు. బీజేపీ నేతలు ఎంతకూ వెనక్కు తగ్గక పోవడంతో ఇరు పార్టీల మధ్య పోరు మొదలైంది . కొన్నిచోట్ల ఘర్షణలకు దారి తీస్తుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదే అంశంపై బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో టీఆర్ఎస్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద సాయం చేస్తున్న సర్కార్ కు తమ వంతు సాయం చేసేందుకు వస్తే ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. వరదల్లో నష్టపోయిన వారందరికీ సాయం అందించడమే తమ లక్ష్యం అని .. పార్టీ కండువాలు వేసుకుని కార్యకర్తలతో డబ్బులు పంచించడం తగదని బీజేపీ నేతలు అంటున్నారు.