ఎన్నికల్లో విజయం సాధించడానికి రాజకీయ పార్టీలు పలురకాల ఎత్తుగడలను వేస్తుంటాయి. అలాగే ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడానికి అధికార వైసీపీ కూడా తన ఎత్తుగడలను వేస్తోంది. అయితే ఏపీ సీఎం వేస్తున్న ఎత్తుగడలు కాస్త మిస్ ఫైర్ అవుతున్నాయి. ఎక్కడ ఎలాంటి వ్యూహాలు వేయాలో తెలియకుండా పప్పులో కాలేస్తూ ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. అందుకు సాక్ష్యం మొన్న చిలకలూరిపేటలో టీడీపీ- జనసేన- బీజేపీ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగళం సభనే ఉదాహరణగా చూసుకోవచ్చు. సభకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆ సభలోనే భద్రతకి సంబంధించిన తాను అనుకున్నట్టుగా వ్యూహాం రచించాడు జగన్.. దానికి సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు వంత పాడారు.. అదికాస్త బెడిసికొట్టడంతో.. ఆ సభ నిర్వహణకు సంబంధించి బాధ్యులుగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులను ఈడ్చికొట్టింది ఎలక్షన్ కమిషన్. దీంతో జగన్‌కి దిమ్మతిరిగి.. బొమ్మ కనిపించింది.
ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి గత మార్చి నెల 17న చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో సభను ఏర్పాటు చేసింది. సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రధాని పాల్గన్న సభలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రధానిగా తాను పాల్గొన్న ఎన్నికల సభలో ఇంతటి భద్రతా వైఫల్యం ఏమిటనీ ఒకింత ఆశ్చర్యానికి గురైనప్పటికీ.. తాను హుందాగా వ్యవహారించి సభను కొనసాగించి వెళ్లిపోయారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగంగా విచారించి.. అందుకు సంబంధించిన నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి పంపించింది. కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా ఎలక్షన్ కమిషన్ పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఇంటలిజెన్స్ నివేదికలో.. నెలన్నర కిందట ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కడప పర్యటనకు వచ్చినపుడు పోలీసులు అతి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పొరుగు జిల్లాల నుంచి 1058 మంది సివిల్ పోలీసులను, 13 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలను మరో రెండు గ్రేహౌండ్స్ యూనిట్లతోపాటు పదుల సంఖ్యలో ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్‌ను దించారు. కానీ .. హైసెక్యూరిటీ ఉన్న దేశాధినేతల్లో టాప్ ఫైవ్ స్థానంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి సభకు వస్తే కేవలం ఐదు ఏపీఎస్పీ ప్లటూన్లను బందోబస్తుకు పంపారు పోలీసులు. ప్రధాని పర్యటన సందర్బంగా ట్రాఫిక్ మొదలుకొని ఎక్కడికక్కడ భద్రతా వైఫల్యం కనిపించడంపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా తీసింది. రాష్ట్ర సీఎం భద్రత కన్నా .. దేశ ప్రధాని రక్షణకు తక్కువ పోలీసులను వినియోగించిన విషయం తెలుసుకుని నివ్వెరపోయింది. నివేదికను పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ గుంటూరు ఐజీ పాలరాజుపై, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ముగ్గురూ ప్రధాని సభ పర్యవేక్షణలో విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల వేళ ఏపీలో ఉన్నతాధికారులు తమ ఇష్టానుసారంగా అధికార వైసీపీకి వత్తాసు పలుకుతుండటంతో ఐఏఎస్, ఐపీఎస్‌లను బదలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవంగా అయితే వారిని సస్పెండ్ చేయాలి.. కానీ వారు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు కావడంతో.. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ.. ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎలాంటి విధులను అప్పగించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి వత్తాసు పలికే అధికారులపై వేటు పడటంతో.. ప్రతిపక్ష టీడీపీ కూటమిలో ఆనందం వ్యక్తం అవుతుండగా.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రం డల్ అయ్యారని పార్టీలు వర్గాలు చెబుతున్నాయి.