వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలు ప్రధాన అంశంగా, ప్రస్తుత అధికార వైసీపీకి లాభం చేకూర్చే ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం యాత్ర 2 అని అందరికీ తెలుసు. తండ్రీ కొడుకుల ఎమోషన్ ను మాత్రమే చూపించానని డైరెక్టర్ మహి వి.రాఘవ్ చెబుతున్నప్పటికీ, ఇదొక పక్కా పొలిటికల్ బెనిఫిట్స్ తో తీసిన సినిమా అని అర్థం అవుతోంది. సినిమాలో తాను చేర్చిన సన్నివేశాలు అన్నీ ఊహజనితమని డైరెక్టరే నేరుగా చెబుతున్నాడు. ఎందుకంటే, అంతటి గుండెను పిండేసే సన్నివేశాలు నిజజీవితంలో అటు వైఎస్ విషయంలోగానీ, ఇటు జగన్ యాత్రలో గానీ, అస్సలు కనబడవు.
అయితే, యాత్ర 2 సినిమా తీసినందుకు గానూ డైరెక్టర్ మహి వి.రాఘవ్ కు సీఎం జగన్ భారీ కానుక ముట్టజెప్పబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కు అప్పనంగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దానివిలువ సుమారు రూ.20 కోట్ల విలువ ఉంటుందని అంచనా. దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని డైరెక్టర్ కు అప్పగించడానికి సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. త్రీ ఆటమ్ లీవ్స్ అనే సంస్థ యాత్ర 2 ను నిర్మించగా.. దీని వ్యవస్థాపకుడు కూడా డైరెక్టరే. ఆ సంగతి అటుంచితే ‘రూరల్ మినీ స్టూడియో’ నిర్మిస్తానని, ఏపీలో చిత్ర పరిశ్రమను నెలకొల్పేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఈమధ్య మహి వి. రాఘవ్ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. అందుకు హార్సిలీహిల్స్‌లో పదెకరాల స్థలం ఇవ్వాలని లేఖలో కోరారు. గత ఏడాది జూన్ 17న ఆయన సీఎం జగన్ కు రాసిన లేఖ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
అప్పటికి ఇంకా యాత్ర 2 సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఆ సమయంలోనే మహి వి. రాఘవ్ ఈ లేఖ రాసినట్లు తెలిసింది. తాజాగా యాత్ర 2 విడుదలవగా.. దాన్ని వైసీపీ నేతలు హిట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ కూడా స్పందించి భూ బదిలీ ప్రక్రియను రెడీ చేస్తున్నారని అంటున్నారు. ఆ దరఖాస్తును ముందుకు తీసుకెళ్లాలంటూ.. సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి పర్యాటక శాఖను కూడా ఆదేశించినట్లు తెలిసింది. గత నెల 29న ఆ ఫైలు సంగతిపై రెవెన్యూ స్పెషల్ సీఎస్ నుంచి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా వెళ్లినట్లు తెలిసింది.
యాత్ర 2 విడుదల కాగానే మదనపల్లి ఆర్డీవో హరిప్రసాద్, బి.కొత్తకోట మండల అధికారులు హార్సిలీహిల్స్‌కు వెళ్లి స్థలాన్ని పరిశీలించినట్లు చెబుతున్నారు. తొలి విడతలో దాదాపు రెండెకరాల భూమిని మహి వి రాఘవ్ కు కేటాయిస్తారని, ఆ తర్వాత మిగతా స్థలం దశలవారీగా ఇస్తారని చెబుతున్నారు.