డిసెంబర్ 29న విడుదల కావాల్సిన ‘వ్యూహం’ సినిమా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆగిపోయింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ కుమ్మక్కై.. రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రతిష్ఠను దిగజార్చి తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఈ వ్యహం సినిమాను తీశారు. సెన్సార్ బోర్డు నుంచి తప్పుడు దారిలో ఆర్జీవీ సర్టిఫికెట్ కూడా పొందారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ సినిమా విడుదలను ఆపేయాలని, సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ తరపున నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం.. వ్యూహం సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు చూపించారనే ఉద్దేశంతో డిసెంబర్ 29న విడుదల కావాల్సిన సినిమాను ఆ రోజు రిలీజ్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 11 వరకూ వాయిదా వేసింది.
అయితే, వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయడంలో లోకేశ్ సక్సెస్ అయ్యారనే చర్చ మొదలైంది. రామ్ గోపాల్ వర్మ నేచర్ ప్రకారం.. ఆయన తన శత్రువులను కూడా సందర్భాలను బట్టి పొగుడుతుంటారు. ఏదైనా వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించిన వారిని ఆర్జీవీ ప్రశంసిస్తారు. ఒకవేళ ఏమీ చేయలేకపోకపోతే అదే రీతిలో ఎగతాళి కూడా చేస్తారు. గతంలో చాలా సందర్భాల్లో ఇది రుజువు అయింది. వ్యూహం సినిమా విడుదలను లోకేశ్ సమర్థంగా అడ్డుకోగలిగారు. దీంతో లోకేశ్ వ్యవహారానికి ఆర్జీవీ ఫిదా అయినట్లు సమాచారం. అంతేకాక, ఇటీవలి రాజకీయాల్లో లోకేశ్ పాత్ర కూడా చాలా కీలకం అయింది. ప్రజల్లోకి బాగా వెళ్లి ఇప్పుడు లోకేశ్ ఒక బలమైన నేతగా ఎదిగారు. లోకేశ్ ఎదిగిన తీరుకు కూడా ఆర్జీవీ మెచ్చుకోకుండా ఉండనట్లు తెలుస్తోంది.
వ్యూహం సినిమా విషయంలో కూడా పిటిషన్ మళ్లీ జనవరి 11న విచారణకు రానుంది. ఈ క్రమంలో సెంట్రల్ సెన్సార్ బోర్డు వివరణ కూడా ధర్మాసనం కోరింది. ఆ వివరణ ప్రకారం.. వ్యూహం సినిమాకు జారీ చేసిన సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ ను కొనసాగించాలా రద్దు చేయాలా అని కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిస్థితుల్లో వ్యూహం సినిమా తెరక్కిన విధానం విషయంలో న్యాయపరంగా ఆర్జీవీ మిస్ అయిన లాజిక్స్‌ను లోకేశ్ వెతికి పట్టుకొనే పనిలో ఉన్నారు. ఇందుకోసం న్యాయనిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇప్పటికే భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇలాంటి ఇతరుల ప్రతిష్ఠను దిగజార్చే సినిమాలు సరికాదని వాదించారు. మొన్న విజయవాడలో జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వైసీపీ మంత్రులు హాజరయ్యారని.. దాంట్లో వారు చంద్రబాబును దూషిస్తూ మాట్లాడిన విషయాన్ని హైకోర్టులో ప్రస్తావించారు. అంతేకాక, సినిమాలో పాత్రల పేర్లు కూడా అవే పెట్టిన విషయాన్ని కూడా లేవనెత్తారు. సమాజంలో వ్యక్తుల గౌరవ ప్రతిష్ఠలకు ప్రాధాన్యం ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా హైకోర్టు ఎదుట మెన్షన్ చేశారు.
లోకేశ్ తరపు న్యాయవాదులు లేవనెత్తిన అన్ని అంశాలు ఆమోదయోగ్యంగా ఉండడంతో హైకోర్టు విడుదలను నిలిపివేసింది. అదే సమయంలో సీబీఎఫ్‌సీ ప్రతినిధుల తీరును కూడా తప్పుబట్టింది. తాము సినిమాలో కొన్ని అంశాలను తొలగించి సర్టిఫికేట్ జారీ చేశామని చెప్పుకున్నప్పటీక హైకోర్టు అంగీకరించలేదు. జనవరి 11 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మొత్తానికి సినిమా విడుదలను అడ్డుకొని లోకేశ్ సక్సెస్ అవడంతో ఆర్జీవీ కూడా ఆయన పనితనానికి ఫిదా అయినట్లు తెలుస్తోంది.