ఏపీలో ప్రతిపక్షాల ప్రతిష్ఠ దిగజార్చే దురుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుమ్మక్కై రెడీ చేసి సినిమాకి మళ్లీ అడ్డంకులు వచ్చాయి. రిలీజ్ కు సిద్ధం అయిన ఈ సినిమా ఆపేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాక ఏకంగా సెంట్రల్ సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను కూడా హైకోర్టు వచ్చే నెల 11 వరకూ రద్దు చేసింది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా వ్యూహం సినిమాని విడుదల చేయొద్దని నిర్మాణ సంస్థలైన రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను దెబ్బతీయడం కోసం రామ్ గోపాల్ వర్మ ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాని తెరకెక్కించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా అలాంటి సినిమాకి సెంట్రల్ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ గురువారం జరిగింది. ఏకంగా ఉదయం 11.45 నుంచి సాయంత్రం దాకా ఈ పిటిషన్ పై జడ్జి జస్టిస్ నంద వాదనలు విన్నారు. తర్వాత రాత్రి 11.30 గంటలకు పైన పేర్కొన్న ఉత్తర్వులు ఇచ్చారు. సినిమా పూర్తి దురుద్దేశంగా ఉందని ప్రాథమిక ఆధారాలు ఉండడంతో సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ ను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు ఉన్నం మురళీధర్ రావు, ఉన్నం శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. రామ్ గోపాల్ వర్మ దీన్ని భావ ప్రకటనా స్వేచ్ఛ అంటున్నారని.. ఆ నెపంతో కక్ష సాధింపుగా సినిమాలు తీయడం కరెక్టు కాదని వాదించారు. చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చాలని ప్రొడ్యుసర్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్న విషయాన్ని న్యాయమూర్తికి వివరించారు. వారు బహిరంగంగా మాట్లాడిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో చేసిన పోస్టులను చూపించారు. గతంలో అయిదారు సినిమాలు తీసి.. వాటితో ఎలాంటి లాభం రాకపోయినా మళ్లీ తీస్తున్నారని అన్నారు. ఇలా కక్ష్య సాధింపు సినిమాలు తీయడం కోసం.. దీనివల్ల లబ్ధి పొందుతున్న ఓ రాజకీయ నేత నుంచి వీరికి ఆర్థిక సాయం అందుతుందని అన్నారు.
వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా వైసీపీ మంత్రులు హాజరయ్యారని.. వారు వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. అంతేకాక, సినిమాలో పేర్లు కూడా అవే పెట్టారని చెప్పారు. వ్యక్తుల గౌరవ ప్రతిష్ఠలకు ప్రాధాన్యం ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులను న్యాయవాదులు గుర్తు చేశారు. నిర్మాత తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కేవలం ట్రైలర్ చూసి కోర్టుకు రావడం.. సినిమాను ఆపేయాలని కోరడం కరెక్టు కాదని అన్నారు. సెన్సార్ బోర్డు తరఫున అదనపు ఏజీ పి.నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ ఒకసారి బోర్డు సర్టిఫికెట్ జారీ చేశాక కోర్టులు జోక్యం చేసుకోకూడదని అన్నారు. 10 మందితో కూడిన కమిటీ సినిమాను పరిశీలించి కొన్ని అంశాలను తొలగించాలని సూచించిందని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ప్రస్తావనను.. కొన్ని పేర్లను తొలగించాలని సూచించిందని చెప్పారు. అవి జరిగాకే సినిమాకు సర్టిఫికేట్ జారీ చేశారని చెప్పారు.