మనలాగే ఓ తల్లికన్న మామూలు మనిషి కదరా గాంధీ.. మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదు ఆయన స్ఫూర్తి.. సత్యాహింసల మార్గజ్యోతి.. నవశకానికే నాంది.. అన్నారు సిరివెన్నెల. ఎన్నో ఏళ్ళ పరాయి పాలనను కేవలం అహింస అనే ఆయుధంతో కూకటివేళ్ళతో పెకలించిన బాపూజీ.. సిసలైన జగజ్జేత. ఆయన చూపిన మార్గం ఎందరికో ఆదర్శప్రాయం. అందుకే ఆయనలాంటి ఓ అద్భుతమైన వ్యక్తిని, స్వాతంత్ర్య సమరశక్తిని బలమైన మీడియా అయిన సినిమా ద్వారా అనేకసార్లు ప్రేక్షకుల కనుల ముందు సాక్షాత్కరింపచేశారు చాలా మంది దర్శకులు. ఆయన పాత్రను ఎంతో అపురూపంగా పోషించి తరించారు పలువురు నటులు. గాంధీజీ అందరికీ తెలిసినా.. ఎన్నిసార్లు ఆ పాత్ర తెరమీద కనిపించినప్పటికీ వాటిని ఆదరించి అక్కున చేర్చుకున్నారు భారతీయ ప్రేక్షకులు. గాంధీజీ 151వ జయంతి సందర్భంగా ఆ మహాత్ముణ్ణి మరొక్కసారి స్మరించుకుంటూ.. ఆయన స్ఫూర్తితో, ఆయన జీవిత కథలతో తెరకెక్కిన సినిమాల విశేషాలేంటో చూద్దాం.
రిచార్డ్ అటెన్ బరో ‘గాంధీ’
గాంధీజీ మీద ఎంత మంది దర్శకులు ఎన్ని సినిమాలు తీసినా.. 1982 లో తెరకెక్కిన ‘గాంధీ’ సినిమా చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఇందులో గాంధీగా నటించింది , ఈ సినిమా దర్శకుడు ఇద్దరూ బ్రిటీష్ వారే. ఎవరిని ఇండియా నుంచి తరిమికొట్టడానికి గాంధీజీ అహర్నిశలూ శ్రమించారో.. ఆ దేశానికి సంబంధించిన వారే గాంధీజీ మీద సినిమా తీయడం అప్పట్లో సంచలనమైంది . గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో ట్రైయిన్ లోంచి తోసేసిన దగ్గర నుంచి ఆయన మరణం వరకూ ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో గాంధీజీగా .. ప్రముఖ నటుడు బెన్ కింగ్ స్లే జీవించగా.. రిచర్డ్ అటెన్ బరో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు.

శ్యాం బెనగల్ ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’
గాంధీజీ.. సత్యాన్నే పలకడానికి, అహింసా మార్గాన్ని అవలంబించడానికి దారితీసిన పరిస్థితులు… ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది లాంటి విశేషాలతో బెంగాలీ దర్శకుడు శ్యాం బెనగల్ తెరకెక్కించిన సినిమా ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’. మహాత్ముడిగా మారడానికి పూర్వం గాంధీజీ జీవితాన్ని ఆవిష్కరించిన ఈ సినిమాలో గాంధీజీగా నటించిన రంజిత్ కపూర్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది.

చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా .. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం ‘శంకర్ దాదా జిందాబాద్’. ప్రేమించిన అమ్మాయి మెప్పుకోసం గాంధీజీ పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన శంకర్ దాదా అనే రౌడీకి.. ఆయన సిద్ధాంతాలు వ్యసనంగా మారతాయి. వాటిని పూర్తిగా అర్ధం చేసుకొన్న శంకర్ కి .. గాంధీజీ కనపడి కర్తవ్య బోధ చేస్తూ.. అతడిని సరైన మార్గంలో నడిపిస్తూంటాడు. ఇందులో గాంధీజీ పాత్రను ఒరిజినల్ వెర్షన్ లగేరహో మున్నాభాయ్ లో చేసిన దిలీప్ ప్రభావల్కర్ అనే మరాఠీ నటుడే పోషించాడు.

శ్రీకాంత్ 100వ సినిమా ‘మహాత్మ’
శ్రీకాంత్ హీరోగా, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం మహాత్మ. ఒక రాజకీయ నాయకుడి కుడిభుజంగా, ఆయనకి రక్షణగా ఉంటూ.. చంపడానికి కూడా వెనుకాడని ఓ రౌడీ … ఒక దశలో .. ఒక విప్లవాత్మక మార్పుతో గాంధీజీ సిద్ధాంతాలకి, ఆయన వ్యక్తిత్వానికి ఎలా ఆకర్షితుడవుతాడు? తన తప్పు తెలుసుకొని మంచి మార్గంలో ఎలా పయనిస్తాడు అన్నదే ఈ సినిమాకథ. ఇందులో గాంధీజీగా రామ్ జగన్ కనిపిస్తాడు. ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ పాట స్ఫూర్తినిస్తుంది.

గాంధీజీ కలలుకన్న ‘మరో ప్రపంచం’
1970లో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.. నిర్మించి, ఆయనే దర్శకత్వం వహించిన సందేశాత్మక చిత్రం ‘మరో ప్రపంచం’. చక్రవర్తి చిత్ర నిర్మాణ సంస్థ బ్యానర్ పై లాభాపేక్ష లేకుండా ఈ సినిమాను నిర్మించారు. జయాపజయాల సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో గాంధీజీ కలలు కన్న ప్రపంచాన్ని తెరమీద ఆవిష్కరించగలిగారు. గాంధీజీ శతాబ్ది జన్మదిన వేడుకల సందర్భంగా కొందరు రాజకీయ నాయకులు, సాంఘిక సంస్కర్తలు గాంధీజీ సిద్ధాంతాలకి సంబంధించిన ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఎవరూ వాటిని అనుసరించరు, ఆచరణలోపెట్టరు. దాంతోవిసుగుచెందిన తొమ్మిదిమంది యువకులు .. ఒక సంస్థగా ఏర్పడి కొందరు పిల్లల్ని అపహరించి.. వారి కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తారు. కులం కుళ్ళు, మతం మత్తు వారికి అంటకుండా.. వారికి ఉత్తమ పౌరులుగా శిక్షణనిస్తుంటారు. సినిమాకి ప్రశంసలు దక్కాయి కానీ.. కాసులు రాలలేదు.

గాంధీపుట్టిన దేశం
గాంధీపుట్టిన ఈ దేశంలో.. అప్పటి రాజకీయ నాయకులు, స్వార్ధ పరుల అరాచకాలకు కొందరు ఎలా బలైపోయారు అన్న కథాంశంతో .. ప్రభాకరరెడ్డి నిర్మించిన అద్భుత సందేశాత్మక చిత్రం ‘గాంధీపుట్టిన దేశం’. లక్ష్మి దీపక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణంరాజు హీరో. ‘గాంధీ పుట్టిన దేశం.. రఘురాముడు ఏలిన రాజ్యం.. ఇది సమతకు మమతకు సందేశం’ పాట ఆకట్టుకుంటుంది.

టి.కృష్ణ అభ్యుదయ చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’
అభ్యుద చిత్రాల దర్శకుడు టి.కృష్ణ ఈ తరం పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. అవినీతి, స్వార్ధ రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో.. పి.యల్. నారాయణ వెంకయ్య అనే పాత్రలో గాంధీజీ వేషధారణతో కనిపిస్తాడు. మన దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదనే బెంగతో, ఆ భ్రమలోనే బతుకుతుంటాడు ఆయన. గాంధీజీ సిద్ధాంతాలతో .. గాంధేయ మార్గంలో బ్రతికే అలాంటి వారిని కూడా రాజకీయనాయకులు తమ స్వార్ధానికి బలిచేస్తారు అనే సందేశాన్ని ఈ సినిమాతో చాలా పవర్ ఫుల్ గా చెప్పారు టి. కృష్ణ.

గాంధీజీ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి అని ఈ సినిమాలన్నీ నిరూపిస్తాయి. ఆయన మార్గం ఎప్పుడూ అనుసరణనీయమే… ఆయన సిద్ధాంతాలు ఎన్నడూ ఆచరణనీయమే.











