“తన భార్య ప్రసవ సమయం సమీపించిందని .. తాను తండ్రిని కాబోతోన్నానని.. తనకు పితృత్వ సెలవులు కావలి” అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. అందువల్ల శుక్రవారం నుండి తొమ్మిది రోజుల పాటు తాను బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదని .. తరువాత పాల్గొంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్ కు లేఖ రాశారు.
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గైర్హాజర్ కానున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదు. దీనికి కారణం- పితృత్వ సెలవులు. తనకు పితృత్వ సెలవులు కావాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందట లేఖ రాశారు. తన భార్య ప్రసవ సమయం సమీపించిందని, తాను తండ్రిని కాబోతోన్నానని తెలిపారు. ఈ కారణంతో శుక్రవారం నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు తాను బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేనని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు తనకు సెలవు కావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల 11వ తేదీ నుంచి మళ్లీ తాను బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని పేర్కొన్నారు. తన భార్య ప్రసవానికి ముందు.. ఆ తరువాత.. ఆమె బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఓ భర్తగా.. కాబోయే తండ్రిగా తన మీద ఉందని గుర్తు చేశారు. ఈ తొమ్మిది రోజుల పాటు తన గైర్హాజరీని పితృత్వ సెలవుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.
తండ్రి కాబోతున్న రామ్మోహన్
రామ్మోహన్ నాయుడు.. తెలుగుదేశం పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కుమార్తె శ్రావ్యను 2017లో వివాహం చేసుకున్నారు. రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడు .. బండారు సత్యనారాయణ మూర్తి మంచి స్నేహితులు. ఆ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. తండ్రి ఎర్రన్నాయుడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన పోటీ చేసిన రెండుసార్లూ శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు. ఇక ఆయన తండ్రి కాబోతోన్నారు.
Must Read ;- పలాసలో టీడీపీ కార్యకర్త అదృశ్యం.. ఎంపీ నిరసన
సంసద్ రత్న పురస్కార గ్రహీత
లోక్సభ సభ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే సభ్యుడిగా రామ్మోహన్ నాయుడికి మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గం ప్రజల తరపున అనేక అంశాలపై ఆయన సభలో ప్రస్తావించిన తీరు.. రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకతను తెచ్చిపెట్టంది. చిన్న వయస్సులోనే సంసద్ రత్న పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన సభ్యులకు లభించే పురస్కారం ఇది. అటువంటి రామ్మోహన్ నాయుడు సెలవు పెట్టడం .. ఆయన బాధ్యతను తెలియజేయడంతో పాటు .. జిల్లాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
Also Read ;- రామ్మోహన్ను నాగ్ ఢీ కొనగలరా?











