(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కింజరాపు కుటుంబానికి చెక్ పెట్టేందుకు ముఖ్యంగా అప్రతిహత విజయాలతో దూసుకుపోతూ టీడీపీకి ఆయువుపట్టుగా, వైసీపీకి పక్కలో బళ్లెంలా తయారైన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు బ్రేకులు వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సరికొత్త వ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత శాసనసభ స్పీకర్, సీనియర్ రాజకీయ నాయకులు తమ్మినేని సీతారాం తనయుడు నాగ్‌ను రామ్మోహన్‌కు ప్రత్యర్థిగా రూపొందించాలని సూచించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌ను కలిసిన తమ్మినేని తన తనయుడు నాగ్‌ను పరిచయం చేసినట్లు తెలిసింది. అదే తరుణంలో నాగ్ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు వివరించినట్లు వినికిడి. ఈ సందర్భంగా నాగ్ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న జగన్ రామ్మోహన్‌కు ధీటుగా ఎదగాలని సూచించినట్లు తెలిసింది. అందువల్ల రామ్మోహన్‌కు ప్రత్యర్థి సిద్ధమైనట్లు జిల్లా అంతటా చర్చ కొనసాగుతోంది.
వారసులు ఎంట్రీ ..
రాజకీయాల్లో నేతల వారసుల ఎంట్రీకి కొదవేలేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరూ తమ తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమ నియోజకవర్గాల్లో ఎక్కువగా వారసులు రంగంలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీడీపీ నుంచి రంగంలోకి దిగిన వారసుల్లో ఒకరు తప్ప అందరూ ఓడిపోయినప్పటికీ, వైసీపీ వారసులు మాత్రం అందరూ అద్వితీయ విజయం సాధించారు. ఈ పరంపరలో మరో నాయకుడు కూడా రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు నాగ్.. త్వరలోనే వైసీపీ నుంచి రాజకీయ రణరంగంలోకి దూకుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇంజనీరింగ్ చదివిన తమ్మినేని నాగ్.. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోయేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.
Must Read ;- వైసీపీ కోరి తెచ్చుకుంటే.. కొంప ముంచుతున్న సంచైత
తండ్రి బాటలో ..
తండ్రి బాటలో రాజకీయాల్లోకి రావాలనేది తమ్మినేని నాగ్ ఆలోచన. గత ఏడాది ఎన్నికల్లో సీతారాం గెలుపునకు నాగ్ ఎంతో కృషి చేశారని ఆముదాల వలస నియోజకవర్గంలో ప్రచారం ఉంది. యువతను ప్రధానంగా ఆకర్షించి.. తన తండ్రికి ఓట్లు వేయించడంలో తమ్మినేని నాగ్ మంచి వ్యూహంతో ముందుకు సాగారని అంటున్నారు. సీతారాం కూడా తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. తమ్మినేని ఇప్పటికే మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు. టీడీపీలో ఉండగా అప్పుడెప్పుడో 1999లో చివరిగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఇరవైయేళ్లకు గత యేడాది మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. ఇదే తరుణంలో తన తనయుని వారసునిగా ప్రవేశింపజేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్‌కు పరిచయం చేసి..
తాజాగా ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన తమ్మినేని నాగ్‌ను సీఎం జగన్‌కు పరిచయం చేశారు స్పీకర్. ఈ క్రమంలో తమ్మినేని నాగ్ వ్యక్తిగత వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాషణల నేపథ్యంలోనే తన కుమారుడి రాజకీయ అరంగేట్రం విషయాన్ని సీతారాం జగన్ చెవిలో పడేశారు. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించారని అంటున్నారు వైసీపీ నాయకులు. త్వరలోనే తమ్మినేని నాగ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోనే ఒక నియోజకవర్గం నుంచి నాగ్‌ను పోటీ చేయించాలని స్పీకర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆముదాలవలస నుంచి సీతారాం పోటీ చేసినా.. మరో నియోజకవర్గాన్ని ఎంచుకుని తమ్మినేని నాగ్‌ను బరిలోకి దింపుతారని అంటున్నారు. అయితే ఒకే కుటుంబానికి జగన్ రెండు సీట్లు ఇస్తారా ? అన్నది సస్పెన్స్ అయినా జగన్ ఇక్కడ ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఈ కుటుంబానికి రెండు సీట్లు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ధీటుగా ఎదగాలని తమ్మినేని నాగ్‌కు జగన్ సూచించడాన్ని బట్టి చూస్తే నాగ్‌కు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇవ్వొచ్చన్నదే జగన్ ఆలోచనేమో అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
Also Read ;- ‘దైవదూత’ కీర్తనలతో తమ్మినేనికి ఫలం దక్కుతోంది మరి!!