స్థానిక ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న చిట్టచివరి దింపుడుకళ్లెం అశ కూడా ఆవిరైపోయింది. ఏ ‘సుప్రీం కోర్టు విచారణ’ పేరుతో.. ఇంకొద్దిగా సాగదీయాలని ప్రభుత్వం అనుకున్నదో ఆ తీర్పు కూడా వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించవలసిన అనివార్యత మినహా.. ప్రభుత్వం ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. సాంకేతికంగా పరిస్థితి ఇంతే. అయితే ఇదంతా ఇలాగే అనుకున్నట్టుగానే జరుగుతుందా? అనేదే సందేహం. కర్ణాకర్ణిగాన తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఏమైతే అది కావొచ్చు గానీ.. ఎన్నికలు మాత్రం నిర్వహించకుండా.. అమీతుమీ తేల్చుకోడానికి జగన్ తొడకొడుతున్నట్లుగా తెలుస్తోంది.
పార్లమెంటరీ పార్టీ భేటీలో సంకేతాలు..
త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించవలసిన తీరు, సరళి గురించిన మార్గనిర్దేశం చేసే సన్నాహక సమావేశం ఇది. ఒక రకంగా చూసినట్లయితే.. ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందు పార్టీల అధ్యక్షులు చాలా మొక్కుబడిగా నిర్వహించే సమావేశం అది. సహజంగా ఈ సమావేశం తర్వాత.. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం గురించి, కేంద్రం నుంచి రావల్సిన పెండింగ్ నిధుల గురించి.. పార్లమెంటులో పార్టీ గళం వినిపించాల్సిందిగా సీఎం జగన్, ఎంపీలకు సూచించారు అనే ప్రకటన వస్తుంది.
కానీ.. ఇవాళ్టి పార్లమెంటరీ సమావేశం జరిగే సమయానికి- స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీం ధర్మాసనం కూడా వచ్చేసింది. సుప్రీం తీర్పుపై జగన్ మోహన్ రెడ్డి సూచన ప్రాయంగా తన అభిప్రాయాన్ని ఆ సమావేశంలో బయటపెట్టినట్టు తెలిసింది. ఆ మేరకు.. సుప్రీం తీర్పు తమకు ప్రతికూలంగా వచ్చినంత మాత్రాన తలొగ్గ కూడదని.. ఎన్నికలు నిర్వహించకుండా.. రెండు నెలలు నెట్టేయడానికి ఉండే అన్ని రకాల అవకాశాలను జగన్ పరిశీలించబోతున్నట్లుగా తెలుస్తోంది.
Must Read ;- ఎంపీలకు సీఎం జగన్ దిశా నిర్దేశం
ఏం చేయగలరు?
వాస్తవంగా కనిపిస్తున్న పరిస్థితులను బట్టి.. సుప్రీం తీర్పును అనుసరించి, ఎన్నికలు నిర్వహించడం మినహా ప్రభుత్వం ఎదుట మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే అలా చేయడం ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు. రెండు నెలల పాటు రాష్ట్రప్రభుత్వాన్ని సుప్త చేతనావస్థలో ఉంచేలాగా.. రాష్ట్రపతి పాలన విధించేలా జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేంద్రాన్ని కోరుతారా? అనే ఊహాగానాలు ఒకవైపు నడుస్తున్నాయి. అలాంటి నిర్ణయానికి అవకాశం తక్కువ. అంతకూ తెగించి ముఖ్యమంత్రి అలాంటి పనిచేస్తే గనుక.. కొరివితో తలగోక్కోవడమే అవుతుందని కూడా పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనంతగా తాము కేంద్రాన్ని ఆశ్రయించి.. తమ ప్రభుత్వాన్ని రెండు నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేయమని కోరడం అనేది.. అనూహ్యమైన సంగతి.
ఒకవేళ అలా జరిగినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించకూడదని అనుకుంటున్న సీఎం కోరిక నెరవేరడానికి ఏమేరకు ఉపకరిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటే.. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదే తరహా విజ్ఞప్తితో కేంద్రాన్ని ఆశ్రయించి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు గనుక, కొన్ని ఉద్యోగసంఘాలు ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నాయి గనుక.. కేంద్రప్రభుత్వ సిబ్బంది ఎన్నికల నిర్వహణకు కావాలని ఆయన విన్నవించారు.
అటు జగన్ రాష్ట్రపతి పాలన కోరడం, ఇటు నిమ్మగడ్డ కేంద్ర సిబ్బందిని అడగడం రెండూ సాధ్యమైతే గనుక.. కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగవచ్చు కూడా. అప్పుడైనా జగన్ కోరిక నెరవేరదు. ఆ రకంగా కేంద్రం ఎణ్నికలు పెట్టుకున్నా పరవాలేదు గానీ.. తన ప్రభుత్వం ద్వారా.. నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు జరగడానికి మాత్రం వీల్లేదని జగన్ పట్టుదలగా ఉండవచ్చునని కొందరు అంచనా వేస్తున్నారు.
అయితే ఇలాంటి సంభావ్యత చాలా తక్కువగా ఉంది.
ఆ సాహసం చేయగలరా?
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అనే పరిస్థితి వస్తే గనుక.. నిమ్మగడ్డ ఆ పదవిలో ఉండగా.. తన చేతుల మీదుగా ఆ పని పూర్తి చేయకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి వద్ద ఒకే ఒక ప్రత్యామ్నాయం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది- అసెంబ్లీని రద్దు చేయడం మాత్రమే. అసెంబ్లీ రద్దు అయితే.. అసలు ప్రభుత్వమే ఉండదు గనుక.. స్థానిక ఎన్నికలు కూడా జరగవు! అయితే కేవలం తన పంతం నెగ్గించుకోవడానికి.. నిమ్మగడ్డతో తన ఈగో పోరాటంలో విజయం సాధించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పణంగా పెడతారా? తన పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేల రాజకీయ జీవితాలను కూడా పణంగా పెడతారా? అనేది చాలా కీలకమైన చర్చకు దారితీస్తోంది.
అన్ని మార్గాలూ అన్వేషిస్తున్నారు…
జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికలు నిర్వహించకుండా తన పట్టుదల కొనసాగించడం ఎలా అనే విషయం మీదనే సోమవారం పూర్తి ఫోకస్ పెట్టారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత.. సోమవారం నాటికి షెడ్యూలు అయి ఉన్న అన్ని రకాల ప్రభుత్వ సమీక్ష సమావేశాలను జగన్ రద్దు చేసుకున్నారు. తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వపు అడ్వకేట్ జనరల్ తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మూడుగంటలకు పైగా ఏజీతో సీఎం కీలక సమావేశం జరుగుతూనే ఉంది. ఈ సమావేశానికి జగన్ కు కీలక సలహాదారు అయిన.. సజ్జల రామక్రిష్ణా రెడ్డి కూడా హాజరయ్యారు. మంత్రాగం నడుస్తోంది. మరి తను పైచేయి సాధించడానికి జగన్ ఎలాంటి నిర్ణయంతో బయటకు వస్తారో.. అంతిమంగా.. పోరును ఇంకా కొనసాగిస్తూ ఎలా తొడకొట్టబోతున్నారో.. వేచిచూడాలి.
Also Read ;- ఒక హామీ అటకపైకి.. సున్నా వడ్డీ పథకానికి మంగళం?