(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన సిక్కోలులో పలాస కేంద్రంగా అధికార వైసీపీ .. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతునే ఉంది. అధికార వైసీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మధ్య నువ్వా – నేనా అనే స్థాయిలో వైషమ్యాలు చోటు చేసుకున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అనూహ్యంగా మంత్రి పదవి చేజిక్కించుకున్న సీదిరి .. తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు టీడీపీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అదే తరుణంలో పట్టు నిలుపుకునేందుకు ఎంపీ దేనికైనా సిద్ధం అంటుండటంతో .. శ్రీకాకుళం రాజకీయం అంతా పలాస కేంద్రంగా పురివిప్పుతోంది. రోజుకొక సంఘటనతో నిత్యం అలజడి రేకెత్తిస్తోంది.

ఎంపీ దూకుడు ..
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎంపీగా ఓ వైపు పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై గట్టిగానే గళం విప్పుతున్న రామ్మోహన్… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని అధికార వైసీపీపై పోరాటం చేస్తున్నారు. టీడీపీ అధికారం కోల్పోయాక, చంద్రబాబుకు అండగా ఉంది కింజరాపు ఫ్యామిలీనే అని చెప్పుకోక తప్పదు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు పార్టీ తరుఫున గట్టిగా కష్టపడుతున్నారు. అచ్చెన్న జైలుకు వెళ్ళాక రామ్మోహన్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. కానీ అచ్చెన్న బయటకొచ్చాక, బాబు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. దీంతో అచ్చెన్న జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. తన బాబాయ్‌కు తగ్గట్టుగానే రామ్మోహన్ కూడా వైసీపీపై దూకుడుగా వెళుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా స్థాయిలో రామ్మోహన్ టీడీపీని బలోపేతం చేస్తూ, వైసీపీపై విరుచుకు పడుతున్నారు.
మంత్రే టార్గెట్ ..
జిల్లాలోని మంత్రి అప్పలరాజుని రామ్మోహన్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మంత్రి సీదిరి టీడీపీపై నిత్యం ఏదో రకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. మొన్న ఆ మధ్య గౌతు లచ్చన్నని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు మండి పడ్డారు. అలాగే రామ్మోహన్ సైతం, మంత్రిపై విరుచుకుపడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. జిల్లాలో మంత్రిని దెబ్బకొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీని ఇబ్బందుల్లో పెడుతున్న మంత్రి
మంత్రి అప్పలరాజు కూడా టీడీపీని టార్గెట్ చేసుకుని, ఇబ్బందులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తనపై పోస్టులు పెట్టారని, ఓ టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎంపీ రామ్మోహన్ గట్టి పోరాటం చేస్తున్నారు. మంత్రి చెప్పారని, పోలీసులు అర్ధరాత్రి వచ్చి తమ కార్యకర్తని స్టేషన్‌కు తీసుకెళ్లారని, అక్రమ కేసులు కూడా పెట్టారని రామ్మోహన్ ఫైర్ అవుతున్నారు. పోలీసులు సైతం ఈ కేసు విషయంలో పెద్ద క్లారిటీ ఇస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా ఆ టీడీపీ కార్యకర్త అక్రమ మద్యం అమ్ముతూ దొరికాడని చెబుతున్నారు. కానీ రామ్మోహన్ మాత్రం, ఇవి అక్రమ కేసులని, మంత్రి చెప్పారనే ఇలానే జరుగుతోందని మండిపడుతున్నారు. నేరుగా శ్రీకాకుళం ఎస్పీకి కలిసి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
అయితే , ఈ విషయంలో మంత్రికే కాస్త నెగిటివ్ వచ్చేలా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికైతే రామ్మోహన్, అప్పలరాజు మధ్య పోరు సమసే పరిస్థితి కనిపించడం లేదు.











