(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన పలాసలో టీడీపీ కార్యకర్త లక్కోజి వినోద్ అదృశ్యమయ్యారు. అయితే వినోద్‌ను పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వినోద్ పోస్టులు పెట్టారని, అందుకే తీసుకెళ్లారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. వినోద్‌ది నందిగామ మండలం తామరాపల్లి గ్రామం. ఆయన ఆచూకీ కోసం పలాస పోలీస్‌స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్‌నాయుడు నిరసనకు దిగారు. వినోద్ అదృశ్యంపై పోలీసులు పొంతన లేని సమాధానమిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో..
సోషల్ మీడియాలో పోస్టులు, ఫార్వర్డ్‌లు సర్వసాధారణంగా మారాయని, తమపై ఏ స్థాయిలో విమర్శలు చేసినా ఇప్పుడు పాలకులు సహించలేకపోతున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అధికారులే రంగంలోకి దిగి పాలనా వ్యవహారాలపై విమర్శలు చేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడమే ఆలస్యమన్నట్లుగా పోలీసులు రంగంలోకి దిగుతున్నారని, నోటీసులు, కేసులు, అరెస్టులతో బీభత్స వాతావరణం సృష్టిస్తున్నారని, ‘భావ ప్రకటన స్వేచ్ఛ’కు అర్థమే లేకుండా చేస్తున్నారని ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.