Raghu Rama Krishna Raju Fires On YSRCP :
వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు రావద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. సోమవారం నాడు వీడియో ద్వారా రఘురామరాజు మరోమారు మీడియా ముందుకు వచ్చి పార్టీపై, తనపై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అనర్హత వేటు వేయాల్సింది ఎవరిపై అంటూ ఈ సందర్భంగా ఆయన చేసిన సవాల్ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. వైసీపీ తనపై చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూనే.. వైసీపీ రాజ్యంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ రఘురామ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి.
వైసీపీది తప్పు కాదా?
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్టాడిన రఘురామ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. వైఎస్సార్సీపీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పార్టీనే అయినప్పుడు.. వ్యవహారంలో ఆ పార్టీ రాజ్యాంగ సూత్రాలను పాటించాలి కదా అంటూ రఘురామ ప్రశ్‌నించారు. వైసీపీ జగన్ పెట్టిన సొంత పార్టీ కాదన చెప్పిన రఘురామ. వైఎస్సార్ అభిమాని శివశంకర్ పెట్టిన పార్టీని జగన్ గుంజుకున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఏ పార్టీ అయినా రాజ్యాంగబద్ధంగానే నడుచుకోవాల్సిన పరిస్థితిని కూడా రఘురామ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాతృభాష ప్రాధాన్యాన్ని తగ్గించేలా నిర్ణయం తీసుకుంటే.. అది రాజ్యాంగ విరుద్ధమే కదా అని ఆయన ప్రశ్నించారు. రాజద్రోహం వంటి సెక్షన్లను ఉపయోగించరాదన్న కనీస పరిజ్ఞానం కూడా వైసీపీకి లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీ గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రఘురామరాజు ప్రస్తావించారు.
నేనేం తప్పు చేశాను?
వైసీపీకి విరుద్ధంగా తాను చేసిన కార్యక్రమాలేమిటో చెప్పిన రఘురామ.. అందులో తాను ఎక్కడ కూడా రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించలేదని కూడా ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాట ప్రైవేట్ పాఠశాలల్లోనూ తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసే దిశగా తమ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఓ భారత పౌరుడిగా, తెలుగువాడిగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం తనపై ఉందన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో గళం విప్పానని, ఢిల్లీలోని తన అధికార నివాసంలో నిరసన తెలిపానని కూడా రఘురామ చెప్పారు. ఈ రెండు విషయాల్లో తాను ఎక్కడైనా రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టుగా చెప్పగలరా? అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా తెలుగు భాషా పరిరక్షణ కోసం తాను ఉద్యమం చేస్తే.. టీడీపీ ఎంపీగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ తనను పరామర్శించారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. పార్లమెంటులో ఏ విషయంపై అయినా మాట్లాడే హక్కు తనకుందని, తన హక్కును కాలరాసే అధికారం ఏ ఒక్కరికీ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తున్నది తానా? లేదంటే వైసీపీనా? అన్న విషయాన్ని ప్రజలే తేల్చాలని, అనర్హత వేటు ఎవరిపై వేయాలన్న విషయాన్ని కూడా ప్రజలే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
సమగ్ర విచారణ తర్వాతే: లోక్ సభ స్పీకర్
ఇదిలా ఉంటే.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏ సభ్యుడిపై నిర్ణయం తీసుకోవాలన్నా.. సమగ్ర విచారణ తర్వాతే ముందుకెళతానని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆయా సభ్యులపై వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలిస్తామని, సదరు సభ్యుల వివరణనూ తీసుకుంటామని.. రెండు వైపులా అన్ని వివరాలను సేకరించి సమగ్ర పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు ఉండవని కూడా ఓంబిర్లా ప్రకటించినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రఘురామ అనర్హత పిటిషన్ పై మీడియా సంధించిన ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. అంతటితో ఆగని ఆయన.. అనర్హత ఎన్ని రోజుల్లోగా తీసుకోవాలన్న విషయంపై ఓ చట్టం తీసుకువస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. మొత్తంగా రఘురామపై ఇప్పుడప్పుడే అనర్హత ఉందడని ఓంబిర్లా పరోక్షంగా చెప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- సీఐడీలో మరికొన్నాళ్లు ‘పాల్’ ప్రతాపం











