వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వ్యాపార బంధాలు కలిగి ఉండటమే కాకుండా.. జగన్ పార్టీ తరఫున పార్లమెంటులోని పెద్దల సభ రాజ్యసభలో సభ్యుడిగా కొనసాగుతున్న అయోధ్య రామిరెడ్డిపై నల్ల ధనం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఆదాయపన్ను శాఖ అధికారులు హైదరాబాద్ లోని రాంకీ సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాంకీ సంస్థకు చైర్మన్ గా అయోధ్య రామిరెడ్డి వ్యవహరిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అంటే.. రాంకీలో నల్ల ధనం దొరికితే.. అది అయోధ్య రామిరెడ్డికి చెందినదిగానే భావించక తప్పదు కదా. వెరసి వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ‘నల్ల’ దొరగా తేలిపోయారన్న మాట.
నల్లధనాన్ని ఒప్పేసుకున్నారు
ఆదాయపన్ను సోదాల్లో భాగంగా అధికారులు రాంకీ సంస్థల్లో పెద్ద ఎత్తున కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన పలు అనుమానస్పద లావాదేవీలకు చెందిన పత్రాలను కూడా సీజ్ చేశారు. ఈ పత్రాలను ఆధారం చేసుకుని విచారణ చేపట్టిన ఆదాయపన్ను శాఖ పలు కీలక అంశాలను వెలికి తీసింది. రాంకీ సంస్థలో రూ.300 కోట్ల మేర నల్లధనం బయటపడిందని ఆ శాఖ శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. ఈ మొత్తం నల్లధనమేనని, దానికి ఇప్పుడు పన్ను కడతామని చెప్పిన రాంకీ.. నల్లధనం ఆరోపణలను అంగీకరించిందని కూడా ఐటీ శాఖ వెల్లడించింది. నల్లధనం దాచేసి.. అది బయటపడిన తర్వాత పన్ను కడతామంటే.. చేసిన నేరాన్ని రాంకీ.. అంతిమంగా అయోధ్య రామిరెడ్డి చేసిన తప్పును ఒప్పుకున్నట్లే కదా.
ఇంకెన్ని అక్రమాలో చూశారా?
ఇదిలా ఉంటే.. రాంకీపై జరిపిన దాడుల్లో తమకు ఇంకా చాలా విషయాలు వెలుగు చూసినట్టుగా ఐటీ శాఖ వెల్లడించింది. ఓ ఎంపీగా ఉన్న అయోధ్య రామిరెడ్డి.. తన రాంకీ సంస్థలో మెజారిటీ వాటాలను సింగపూర్ కు చెందిన వ్యక్తులకు అమ్మేశారట. అందులో భాగంగా రూ.288 కోట్ల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కూడా నాశనం చేశారట. ఇక ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగ్గొట్టేందుకు ప్లాన్ వేసిన అయోధ్య రామిరెడ్డి.. తన సంస్థకు ఎలాంటి నష్టాలు లేకున్నా.. రూ.1,200 కోట్ల మేర నష్టాలు వచ్చాయని చెబుతూ తప్పుడు లెక్కలు చూపి పన్నును ఎగ్గొట్టేశారట. మొత్తంగా ఇటీవలి ఐటీ దాడులు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని ‘నల్ల’ దొరగా తేల్చేశాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- సీబీఐ ఓకే అంటే.. వారంలో జైలుకు జగన్ 










