ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వమే అడ్డు చెబుతోంది. అయితే ఇప్పుడు ఏకంగా జగన్ కు ఈ ప్రాజెక్టు విషయంలో సొంత రాష్ట్రంలోనే నిరసనలు వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నిరసనలకు టీడీపీ ఎమ్మెల్యేలే శ్రీకారం చుట్టినా.. త్వరలోనే ఇది ప్రజా ఉద్యమంగా మారే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తూ ఆ ప్రాజెక్టుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే పేరు పెట్టిన జగన్ సర్కారు., ఈ ప్రాజెక్టు పాతదేనని చెబుతూ కేంద్రానికి గానీ, కృష్ణా నీటియాజమాన్య బోర్డుకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పనులు మొదలెట్టేసింది. ఈ పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్న సంగతీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు వేదికగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం చిలికిచిలికి గాలివానలా మారిపోయింది.
జగన్ కు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల లేఖ
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఓ వైపు రాయలసీమ ఎత్తిపోతల, మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే.. సాగర్ జలాల మీదే ఆధారపడ్డ తమ పరిస్థితి ఏమిటని కొత్త వాదనను తెర మీదకు తీసుకువచ్చారు. ఈ మేరకు వారు ముగ్గురూ ఉమ్మడిగా సీఎం జగన్ కు ఆదివారం ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ లేఖలో వారు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్లం 885 అడుగులు కాగా.. గడచిన 20 ఏళ్లల్లో కనీసం 20 సార్లు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం రాలేదని స్వయంగా జగనే ఇటీవల చెప్పుకొచ్చారు. మరి 881 అడుగులకు నీరు చేరితేనే పోతిరెడ్డిపాడుకు నీటిని మళ్లించే అవకాశాలున్నప్పుడు.. ఇప్పుడున్న పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే.. దానికి నీటి లభ్యత ఎక్కడిదన్నది అసలు సిసలు ప్రశ్నగా మారింది. అయితే నిన్నటిదాకా పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ గా పేరున్న ఈ ప్రాజెక్టుకు జగన్ సర్కారు కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే పేరు పెట్టింది. అంటే.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి నీటిని ఎత్తిపోసుకోవడమేగా. ఇదే అంశాన్ని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.
ప్రకాశం జిల్లా కోణంలో చూస్తే..
ఓ వైపు తెలంగాణ, మరోవైపు రాయలసీమకు నీళ్లంటూ శ్రీశైలం ప్రాజెక్టుకు ముందే ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే ఇక నాగార్జున సాగర్ కు నీళ్లొచ్చేదెప్పుడు? సాగర్ ప్రాజెక్టు మీదే ఆధారపడ్డ తమ జిల్లాకు సాగు, తాగు నీరు వచ్చేదెప్పుడు అని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమకు నీళ్ల పేరు చెప్పి ప్రకాశం జిల్లాను ఎంగడతారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కరువు జిల్లా అయిన ప్రకాశం జిల్లాకు వచ్చే కొద్దిపాటి నీటికి కూడా గండిపడే ప్రమాదం లేకపోలేదని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని భూములన్నీ భూగర్భ జలాలతో పాటు సాగర్ జలాల మీదే ఆధారపడ్డాయని, ఇప్పుడు రెండు రాష్ట్రాలు శ్రీశైలం ఎగువనే ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశాలే మృగ్యమవుతాయని, సాగర్ కు అసలు నీళ్లే రాని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు లాభం చేకూర్చే ప్రాజెక్టుగా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం జరిగితే.. మరి ప్రకాశం జిల్లా పరిస్థితి ఏమిటన్నది టీడీపీకి చెందిన ఆ జిల్లా ఎమ్మెల్యేల ప్రశ్న. ఇప్పటికే తమ జిల్లాకు లబ్ధి చేకూర్చేలా సాగర్ నుంచి వస్తున్న గుంటూరు ఛానల్ ను దగ్గుబాడు వరకు పొడిగించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జగన్ ప్రాజెక్టుపై తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న తీరును జగన్ సర్కారు ఎలా టాకిల్ చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Must Read ;=- బాబు మార్కు పాలన వీరి వల్ల కాదంతే!