పాల్ అంటే.. ఇక్కడ మనందరికీ తెలిసిన కేఏ పాల్ కాదు. ఈయన పేరు విజయ్ పాల్. ఇంకా గుర్తుకు రాలేదా?.. మొన్నామధ్య తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలం రేపిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, సీఐడీ కస్టడీలోనే ఆయనపై ధర్డ్ డిగ్రీ, సుప్రీంకోర్టు జోక్యంతో బెయిల్.. సీఐడీ సునీల్ కుమార్ పై సంచలన కథనాలు.. ఇలా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ పోతే.. ఆ వార్తల్లో విజయ్ పాల్ పేరు ఎక్కడో వార్తల చివరన వినిపిస్తుంది. నాడు రఘురామతో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5లపై రాజద్రోహం కింద కేసులు నమోదయ్యాయి కదా. ఆ కేసులను ఏ ఫిర్యాదు లేకుండానే సుమోటోగా కేసులు నమోదు చేసిన పోలీసు అధికారి ఈ విజయ్ పాలే. ఏపీ పోలీసు శాఖలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న విజయ్ పాల్.. తన పదవీ విమరణకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ సర్కారు పెద్దలు చెప్పినట్టుగా చేసుకుంటూ పోయారు. ఆ తర్వాత నిబంధనల మేరకు పదవీ విరమణ పొందిన ఆయన.. పది రోజులు తిరక్కుండానే మళ్లీ అదే సీఐడీలో ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా నియమితులయ్యారు. ఈ వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ వార్తగా మారిపోయింది.
నాడు ఏం జరిగింది?
రఘురామరాజుపై దాఖలైన రాజద్రోహం కేసు ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుమోటోగా కేసు నమోదు కావడం నుంచే ఏపీ సీఐడీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు కదిలింది. సరిగ్గా రఘురామరాజును ఆయన జన్మదినం నాడే అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లోని రఘురామరాజు ఇంటిలో ఆయనను అరెస్ట్ చేసి.. ఆయన గన్ మెన్లను కూడా అనుమతించకుండా ఓ కరడుగట్టిన నేరస్తుడి మాదిరిగా జీపులో కుక్కి తరలించింది. ఆపై ఎవరి ఆదేశాలందాయో తెలియదు గానీ.. మరునాడు కోర్టులో హాజరుపరడానికి ముందు రోజు రాత్రి రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది. విషయం బయటకు చెబితే మరింత దారుణాలను చవిచూడాలని ఆయనను భయపెట్టింది. ఇంకేముంది.. ఏమీ తెలియనట్టుగా నటిస్తూ రఘురామరాజును కోర్టులో హాజరుపరచింది. అయితే రఘురామ తనపై పడిన పోలీసు దెబ్బలను న్యాయమూర్తికి వివరించారు. దీంతో షాక్ తిన్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. ఆ విషయాన్ని మరిచిపోవాలంటూ రఘురామరాజును కాళ్లావేళ్లా పడ్డంత పనిచేశారు. అయితే అహం దెబ్బ తిన్న రఘురామ అందుకు ససేమిరా అనడంతో సీఐడీ పరువు గంగలో కలిసిపోయింది. చూడ్డానికి దీనికంతటికీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ పేరు బయటకు వచ్చింది గానీ.. అసలు సిసలు పాత్రధారి విజయ్ పాలేనని తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే అవగతం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పాత ప్లేస్ లోనే కొత్త పోస్ట్
ఏపీ సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేసిన విజయ్ పాల్.. గత నెల(జూన్)తో పదవీ విరమణ చేశారు. అయితే తాము చెప్పిన పనిని పొల్లు పోకుండా అమలు చేసిన పాల్ కు ఏదైనా చేయాలి కదా అని భావించిందో ఏమో తెలియదు గానీ.. పదవీ విమరణ చేసిన పది రోజులకు.. శుక్రవారం వైసీపీ సర్కారు నుంచి కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడైతే పదవీ విమరణ చేశారో.. అక్కడే పాల్ ను ఓఎస్‌డీగా నియమించింది. వచ్చే ఏడాది.. అంటే 2022 జూన్ 30 దాకా ఆ పదవిలో ఆయనను కొనసాగిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే మరి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే.. పదవీ విమరణ చేసినా పోస్టు మాత్రం ఖాయమేనన్న దిశగా ఇప్పుడు ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- జగన్ పై రఘురామ బిగ్ ఫైట్.. హైకోర్టులో పిల్











