సంక్రాంతి అంటే పల్లె పండుగ. ఈ పండుగ రోజుల్లో పల్లెటూళ్లలో కనిపించే సరదాలు వేరు .. సందళ్లు వేరు. అందువలన గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాలు పండగకి వస్తే, ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఆ విషయాన్ని ‘సోగ్గాడే చిన్నినాయనా‘ సినిమాతో నాగార్జున మరోసారి నిరూపించారు. కల్యాణ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున కెరియర్లోనే సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన పాత్ర పేరే ‘బంగార్రాజు’.
‘బంగార్రాజు‘ టైటిల్ తో .. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని నాగార్జున అనుకున్నారు. దర్శకత్వ బాధ్యతలను మళ్లీ కల్యాణ్ కృష్ణకే అప్పగించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు నాగార్జున ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించవలసిందేనంటూ కంకణం కట్టేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మాదిరిగా ఈ సినిమా కూడా ఆయన సొంత బ్యానర్లోనే నిర్మితం కానుంది.
ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రత్యేకమైన సెట్ వేశారట. ఫస్టు షెడ్యూల్లో నాగార్జున .. రమ్యకృష్ణ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో యువ జంటగా నాగచైతన్య – కృతి శెట్టి కనిపించనుందని అంటున్నారు. పెద్దగా గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగును చకచకా కానిచ్చేసి, ‘సంక్రాంతి’కి విడుదల చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారని అంటున్నారు. ఆల్రెడీ అక్కడ ప్రభాస్ .. పవన్ .. మహేశ్ సినిమాలు లైన్లో ఉండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.
Must Read ;- బంగార్రాజులో కృతి శెట్టి నటిస్తుందా..? లేదా..?











