నిజంగానే ఏపీలో పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో పయనిస్తోందనడానికి ఇప్పుడో ప్రబల నిదర్శనం వెలుగు చూసిందనే చెప్పాలి. రాష్ట్రంలోనే కాకుండా యావత్తు భారతావనిలో బ్యాటరీల తయారీలో అగ్రగామిగా పేరుగాంచిన అమరరాజా కంపెనీ.. ఏపీలో తన విస్తరణను దాదాపుగా అటకెక్కించింది. అంతేకాదండోయ్.. ఏపీలోని జగన్ సర్కారు విధానాలతో ఇక వేగలేమన్న భావనతో రాష్ట్రంలోని తమ ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు తరలించే దిశగా కూడా ఆ కంపెనీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టీడీపీ కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం ఆధ్వర్యంలోని అమరరాజా కంపెనీ. ఏపీ పొరుగు రాష్ట్రం తమిళనాడులో దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో ఆ కంపెనీ యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లుగా వినిపిస్తున్న వార్తలు ఏపీ జనాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
అమరరాజ ప్రస్థానం అమోఘం
అమరాన్ పేరు తెలియని భారతీయుడు ఉండడేమో. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే బ్యాటరీ అమరానే. ఈ అమరాన్ బ్యాటరీలను తయారు చేసే కంపెనీనే అమరరాజ. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తండ్రి గల్లా రామచంద్రనాయుడు స్థాపించిన ఈ కంపెనీ అంచెలంచెలుగా ఎదిగింది. తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతి కేంద్రంగా విస్తరించిన అమరరాజ చిత్తూరు జిల్లాలో తనదైన శైలి పారిశ్రామిక ప్రగతిని నమోదు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలే గానీ.. దేశంలోనే అత్యంత పెద్దదైన బ్యాటరీ తయారీ కేంద్రాన్ని కూడా నెలకొల్పే దిశగా అమరరాజ యాజమాన్యం సాగింది. అమరాన్ బ్యాటరీలతో పాటు పలు రంగాల్లో విస్తరించిన అమరరాజ.. జిల్లాలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా పలు సామాజిక కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇచ్చిన భూమినీ వెనక్కు లాగేశారు
ఇలాంటి కంపెనీలను ఏ ప్రభుత్వాలు అయినా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. అయితే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు నిజమేనన్నట్లుగా అమరరాజ తన భవిష్యత్తు ప్రణాళికలను మార్చుకుంటోన్న తీరు నిజంగానే ఏపీ వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని చెప్పాలి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో బ్యాటరీ తయారీ యూనిట్ ను కొనసాగిస్తున్న అమరరాజ.. జిల్లా కేంద్రం చిత్తూరు సమీపంలోని బంగారుపాళ్యం వద్ద మరో భారీ బ్యాటరీ తయారీ కేంద్రానికి సంకల్పించింది. ఇందుకోసం గత ప్రభుత్వాలు 500లకు పైగా ఎరకాల భూమిని కేటాయించింది. అయితే పారిశ్రామిక ప్రగతి అంటే.. అదేదో చీడ పురుగులా చూస్తున్న వైసీపీ సర్కారు.. అధికారంలోకి వచ్చినంతనే ఆ భూములను వెనక్కు తీసుకుంది. అంతేకాకుండా కంపెనీని తీవ్ర మానసిన వేదనకు గురి చేసే చర్యలకు ఉపక్రమించింది.
తమిళనాడులో అతి పెద్ద యూనిట్
ఈ చర్యలన్నింటినీ పంటి బిగువుననే భరిస్తూ వచ్చిన గల్లా ఫ్యామిలీ.. ఇకపై ఈ తరహా వేధింపులను భరించడం తమ చేత కాదని ఓ నిర్ణయానికి వచ్చేసింది. బంగారుపాళ్యం వద్ద ఏర్పాటు చేయదలచిన భారీ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఉపసంహరించుకున్న అమరరాజ.. తాజాగా ఆ యూనిట్ ను పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే దిశగా కదులుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న తమిళనాడులో భారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం తమిళనాడు ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిపిందని, కంపెనీ ప్రతిపాదనలకు ప్రభుత్వం కూడా ఓకే చెప్పిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే దేశంలోనే అతిపెద్దదైన బ్యాటరీ తయారీ యూనిట్ ను అమరరాజ కంపెనీ తమిళనాడులో ఏర్పాటు చేయడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన సొంత రాష్ట్రం కాదని పొరుగు రాష్ట్రం వైపు అమరరాజ చూస్తున్న వైనంపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది. కొత్త కంపెనీలను ఎలాగూ రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వని వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఏపీలోని అమరరాజ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలు కూడా తరలిపోయేలా వ్యవహరిస్తోందన్న చర్చ వైరల్ గా మారిపోయింది.
Must Read ;- కేసీఆర్ ప్రాణం పోస్తుంటే.. జగన్ భరోసా ఇవ్వలేకున్నారే











