వైసీపీ సర్కారు విధానాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న ఆ పార్టీ రెబల్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇప్పుడు చాలా కాలం క్రితమే వైసీపీ దుర్మార్గాలు, అక్రమాలపైనా ఓ రేంజిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు బర్నింగ్ ఇష్యూలనే తీసుకుని వాటిపై తనదైన శైలిలో చెణుకులను జోడించి వదులుతున్న రఘురామ వైసీపీ నేతలకు నిజంగానే చుక్కలు చూపిస్తున్నారనే చెప్పాలి. రఘురామ వ్యాఖ్యలకు తట్టుకోలేక.. ఆయన చేత ఆ వ్యాఖ్యల పరంపరను ఆపేలా చేసే దిశగా ఆయనపై ఏకంగా సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన జగన్ ప్రభుత్వం అభాసుపాలైన సంగతి తెలిసిందే. థర్డ్ డిగ్రీ కారణంగా అయిన గాయాల వల్ల కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న రఘురామ మళ్లీ తన దాడిని మొదలెట్టేశారు. మునుపటి కంటే మరింత ఘాటుగా వాగ్బాణాలను సంధిస్తున్నారు.
కేజీఎఫ్ సిరీస్ లేనట
ఈ క్రమంలోనే వైసీపీ నేతలు అడ్డంగా బుక్కైన విశాఖ మన్యంలో లేటరైట్ పేరిట జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలు, కొండపల్లి పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్నట్లుగా భావిస్తున్న అక్రమ మైనింగ్ పై రఘురామ సోమవారం నాడు తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. సినిమా పేర్లను ప్రస్తావిస్తూ వైసీపీ అరాచకాలను రఘురామ పోల్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయినాయ ఈ దిశగా రఘురామ ఏమన్నారంటే.. ‘‘దేశంలో ‘బాహుబలి’ తర్వాత అంత పెద్ద హిట్టయిన చిత్రం ‘కేజీఎఫ్-1’. ఈ సినిమాలో కోలార్ బంగారు గనుల్లో మైనింగ్ గురించి చూపించారు. గోల్డ్ మైనింగ్ జరిగే చోటుకు ఎవరినీ అనుమతించరు. ఎవరైనా వెళితే చంపేస్తుంటారు. హీరో వెళ్లి ఏదో చేయడం, ఆ విధంగా సినిమా సాగిపోతుంది. ఇప్పుడు ‘కేజీఎఫ్-2′ కూడా వస్తోంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు నన్ను ఆకర్షించాయి. అవేంటంటే… కేజీఎఫ్-3, కేజీఎఫ్-4కు కూడా కథలు సిద్ధమయ్యాయని కొందరు పోస్టులు పెట్టారు. ‘కేజీఎఫ్-3’ చిత్రం మన్యం ఏరియాలో తీస్తారని, ‘కేజీఎఫ్-4’ చిత్రాన్ని కొండపల్లి అడవుల్లో తీస్తారని ఆ పోస్టుల సారాంశం’’ అని రఘురామ తనదైన శైలిలో సినిమాటిక్ సెటైర్ల పేల్చారు.
టీడీపీ నేతల అరెస్ట్‌లు, దాడులు
విశాఖ మన్యంలో లేటరైట్ పేరిట బాక్సైట్ తవ్వకాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి చేపడుతుండగా.. ఆ మొత్తం బండారం విక్రాంత్ రెడ్డి స్నేహితుడు, పార్టనర్ లవకుమార్ రెడ్డి ఫోన్ కాల్ ద్వారా బయటపడిపోయింది. దీంతో అక్కడకు నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కొండపల్లి ప్రాంతంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమ మైనింగ్ చేపడుతున్నారని ఆరోపణలున్నాయి. వీటిపై నిజ నిర్ధారణ కోసమంటూ వెళ్లిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ శ్రేణులు హత్యాయత్నానికి దిగాయి. ఈ ఘటనపై వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు.. బాధితుడైన దేవినేనిపైనే ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ.. వాటిని కేజీఎఫ్ చిత్రాల పరంపరను కోట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Must Read ;- ఫలించిన టీడీపీ పోరు!.. ‘బాక్సైట్’ బద్దలే!











