ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెదేపా నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ వరద బాధితులను పరామర్శించడానికి నిన్న కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో ఆయన మీద కొవిడ్ నిబంధనలు పాటించలేదని, ట్రాక్టర్ మీద అధిక సంఖ్యలో జనాల్ని ఎక్కించుకున్నారంటూ కేసులు నమోదు చేయడంతో ప్రభుత్వం పై లోకేశ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
అవన్నీ ఆయనకు నేరాలే!
రైతుల్ని పరామర్శించడం, రైతులకు అండగా పోరాటం చెయ్యడం, రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం వంటివి అన్ని జగన్ దృష్టిలో నేరాలే. ఈ నేరాలపై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్ద లేవు. అందుకే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు పెట్టారంటూ ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.
గడప దాటని ఆయన.. గడపగడపకీ వెళ్లే నన్ను అడ్డుకోవాలని..
రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తి ఇంత కాలం అయినప్పటికీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి రైతులను పరామర్శించడానికి సమయం కుదరలేదు. వారి పరిస్థితి తెలుసుకునేందుకు కనీసం గడప దాటని ఆయన గడపగడపకీ వెళ్లే నన్ను అడ్డుకోవాలనే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారంటూ తెలిపారు.
మీరు నా పై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి! నేను మాత్రం కష్టాలలో ఉన్న వారి కన్నీళ్లు తుడించేందుకు ప్రతి ఊరూ వెళ్తాను. ప్రతి గడప తొక్కుతాను. బాధితులకు భరోసానిస్తాను అని ట్విటర్ వేదికగా తెలిపారు.
వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు.ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా.(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 27, 2020