టీడీపీ – జనసేన ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో ఆయన నిరుద్యోగులకు ఈ భరోసా కల్పించారు. అంతేకాకుండా, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకూ వారికి రూ.3 వేల నిరుద్యోగ సాయం కూడా చేస్తామని చెప్పారు. ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చూస్తామని లోకేశ్ అన్నారు. ‘యువ గళం నిధి’ కింద నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేంత వరకు రూ.3 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. స్థానిక సంస్థలు/పరిశ్రమల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించేలా పని చేస్తామని, పెట్టుబడులను బాగా ఆహ్వానిస్తామని చెప్పారు. స్థానికంగా వచ్చే పరిశ్రమల్లో అక్కడి వారికే ప్రాధాన్యం కల్పించేలా విధానం తెస్తామని చెప్పారు.
తుని నియోజకవర్గంలో వైఎస్ హయాంలో సెజ్ పేరుతో తక్కువ పరిహారం ఇచ్చి స్థానికుల భూములు తీసుకున్నారని, ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. భూమి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే బలవంతంగా లాక్కున్నారని గుర్తు చేశారు. ఆ సెజ్‌లో నిజానికి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నా కూడా పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాగానే ఆ సెజ్ లో 6 లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా పని చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే కాకినాడ సెజ్‌లో కంపెనీలను తీసుకొచ్చి స్థానికంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. ఆ సెజ్‌కి జగన్ ప్రభుత్వం గోడ కట్టి కనీసం పశువులు మేపుకోవడానికి కూడా వీల్లేకుండా చేసిందని అన్నారు.
సెజ్ భూముల్ని వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ కోసం వాడుకుంటున్నారు. జగన్ పరిశ్రమల రంగాన్ని నాశనం చేశాడని లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క కియా పరిశ్రమ రావడం వల్ల అనంతపురంలో ప్రజల స్థితి గతులు మారాయి. వేల మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ అందించి మరీ.. గత టీడీపీ ప్రభుత్వం యువతను తీర్చి దిద్దింది. ఎలాంటి కాలుష్యం లేని కంపెనీలు తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది.
గన్నవరం సమీపంలో గల మేధా ఐటీ టవర్స్, విశాఖలోని ఐటి పార్క్ లో చంద్రబాబు హాయాంలో ఎన్నో కంపెనీలు పని చేశాయి. విశాఖలో లులు మాల్, అమర్ రాజా కంపెనీలు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. కానీ, జగన్ ప్రభుత్వం వాటిని వెళ్లగొట్టడంతో పెట్టుబడులు పెట్టా్ల్సిన కంపెనీలే కాకుండా, అప్పటికే ఉన్న కంపెనీలు కూడా ఖాళీ చేసి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగాల విషయంలో ప్రజలు కూడా జగన్ ప్రభుత్వం బాగా విసిగిపోయి ఉన్నారు. లోకేశ్ ఇచ్చిన తాజా హామీతో వాళ్లలో మళ్లీ ఆశలు చిగురించాయి. గతంలో లోకేశ్ ఐటీ మంత్రిగా ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చిన సంగతిని ప్రజలు కళ్లారా చూశారు. ఇప్పటి ప్రభుత్వం ఒక్క కంపెనీని కూడా ఏపీకి తీసుకు రాకపోవడాన్ని ప్రజలు బాగా గుర్తు పెట్టుకున్నారు.