అధికార వైఎస్ఆర్ సీపీ అతి విశ్వాసంతో ప్రక్షాళనపై దృష్టి పెట్టడం.. టీడీపీకి బాగా అనుకూలంగా మారింది. కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారన్న ప్రచారంతోనే వైసీపీలో అసంతృప్త నేతలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నారు. ఇప్పటికే పక్క చూపులు చూస్తున్న వారు.. అధికారిక ప్రకటన రాగానే గోడ దుంకే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో కొందరికి వైసీపీ టికెట్లు ఇవ్వకుండా పక్కన పెడుతున్న సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి.
అసమ్మతి నేతలు ప్రత్యామ్నాయంపై ఆలోచన చేస్తున్న వారంతా ప్రతిపక్ష టీడీపీతో టచ్ లోకి వెళ్తున్నట్లుగా చంద్రబాబు చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే, టీడీపీలోకి వస్తామంటున్న వైసీపీ నేతలు అందరినీ చేర్చుకునేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. అలా ఇప్పటికే ఒకరిద్దరిని తాము తిరస్కరించినట్లుగా కూడా చంద్రబాబు చెప్పడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు వ్యాఖ్యలు తాజా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీలో చేరాలనుకున్న నాయకులు మంచి వారైతే ఆలోచిస్తాం కానీ, కొడాలి నాని, రోజా లాంటి వాళ్లు అయితే తీసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు సూటిగా చెప్పేశారు.
దాదాపు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారని టీడీపీ అధినేత చెబుతున్నారు. ఇలా టీడీపీతో టచ్ లో ఉన్నవారిలో విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఫ్యామిలీ, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత పేరు చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఆ నేతలు.. ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి తరహాలోనే జగన్ కు ఝలక్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ నేతలకు స్థానికంగా ఉన్న సమస్యల వల్ల పార్టీ మారాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే, వారిని పార్టీలో చేర్చుకోవాలా? వద్దా? అని తాము ఆలోచిస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి నేతలు ఎలాగైతే వచ్చారో.. ఇప్పుడు వైసీపీపై అసమ్మతితో ఆ పార్టీ నుంచి టీడీపీలోకి అదే స్థాయిలో చేరికలు ఉంటాయని సైకిల్ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా జనవరి నుంచి సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుందని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే టీడీపీలో చేరగా.. తాజాగా రాజధాని ప్రాంతానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా చేరారు. వీళ్లలాగానే ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని ఇటీవలే బోండా ఉమ కూడా అన్నారు.