ఒకప్పటి స్టార్ సౌందర్య ‘అమ్మోరు’గా వస్తే జనం ఎంతగా ఆదరించారో అందరికీ తెలుసు. ఇప్పుడు దక్షిణాది స్టార్ నయనతార ‘అమ్మోరు తల్లి’గా ఈ దీపావళికి అలరించబోతున్నారు.
పౌరాణిక పాత్రలకు సరిపోయే నటీమణులు మనకు తగ్గిపోయారు. ఆ స్థానాన్ని ఇప్పుడు నయనతార భర్తీ చేసేలానే ఉంది. తమిళంలో మూకూతి అమ్మన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అమ్మోరు తల్లిగా అనువదించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈరోజు విడుదల చేసింది. దీని స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ తీసుకుంది. ఈ సినిమాని దీపావాళి సందర్భంగా 14వ తేదీన హాట్ స్టార్ లో విడుదల చేస్తారు.
ఇప్పటికే తన ఇమేజ్ ను పెంచుకున్న నయనతారకు ఈ తరహా పాత్ర విజయవంతమైతే ఇక ఇలాంటి పాత్రలు మరికొన్నింటిని ఆమె ఎంచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రల మీదనే ఆమె దృష్టి పెట్టింది. ఈ సినిమాలో ఆమె లుక్ చూస్తుంటేనే ఇలాంటి పాత్రలకు ఆమె చక్కగా సరిపోతుందని అనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. చాలాకాలం తర్వాత ప్రముఖ గాయని ఎల్.ఆర్. ఈశ్వరి ఈ సినిమా కోసం గళం విప్పారు.
గిరీష్ గోపాలకృష్ణన్ దీనికి సంగీతం అందించారు. తమిళంలో హాస్యనటుడిగా పేరుతెచ్చుకున్న ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తన మిత్రుడు శరవణన్ తో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే దేవుడికీ, మనిషికీ మధ్య జరిగే పోరాటమే కథాంశం అని దర్శకుడు చెబుతున్నారు. దొంగబాబాల టార్గెట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. అజయ్ ఘోష్ ఈ సినిమాలో దొంగబాబాగా నటించారు. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న నయనతారకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.











