ఐపీఎల్ క్రికెట్ సీజన్ లా ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి నానీ సీజన్ అంటున్నారు ఏపీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే కరోనా ప్రారంభమైన నాటి నుంచి అంతమంది మంత్రులు, సీనియర్ నాయకులు, రాజకీయ కురువృద్ధులు అనిపించుకున్న దాడి వీరభద్రరావు వంటి వారు ఉన్నా మంత్రి నానీ మాత్రమే చీటికి, మాటికీ మాట్లాడుతున్నారు.
కరోనా మీద కాని, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కాని దారుణ భాషతో విమర్శలు గుప్పిస్తున్నది మంత్రి నానీ ఒక్కరే. అంతే కాదు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మీద కూడా రెచ్చిపోయి విమర్శలు గుప్పించింది మంత్రి కొడాలి నానీ మాత్రమే.
దేవుళ్ల మీదా… ప్రధాని మీదా కూడా
దేవుళ్ల మీదా, మత విశ్వాసాల మీదా కూడా మంత్రి కొడాలి నానీ తనదైన భాషతో విమర్శలు చేస్తున్నారు. అది ఎంతవరకూ వెళ్లిందంటే చివరికి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలోనూ మంత్రి కొడాలి నాని మీద అధికారిక ఫిర్యాదులు చేసే వరకూ. ఈ ఫిర్యాదులు, తన మీద విమర్శలు ఎక్కువ చేస్తున్నారని, మరొకటో కాని ఈసారి కొడాలి నానీ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే తన మాటలు విసిరారు.
ఇలా మంత్రి కొడాలి నాని ఎందుకు రెచ్చిపోతున్నారని అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆశ్యర్యపోతున్నారు. అయితే మరికొందరు నాయకులు మాత్రం “అబ్బే… ఇదేం లేదు. ఇది మంత్రి కొడాలి నానీ సీజన్. ఈ సీజన్ త్వరలో ముగుస్తుంది. ఆయన తర్వాత మరొకరు వేదిక మీదకు వస్తారు“ అని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు తమ పార్టీకి మొత్తంగా ఎంతో కొంత డేమేజీ తప్పక చేస్తాయని భయపడుతున్న వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మంత్రి కొడాలి నాని సీజన్ నడుస్తోంది అంటున్నారు అధికార… కొండకచో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.
సాయి గారు పలకరేం…
ఇంతకు ముందు ఆయన ఏ నగరంలో ఉంటే అక్కడ, ఏ పట్టణంలో ఉంటే అక్కడ, ఏ గ్రామంలో విడిది చేస్తే అక్కడ విలేకరుల సమావేశాలు పెట్టి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగే వారు. ఏ ఢిల్లీలోనో ఉంటే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించే వారు. ఇంతకీ అది ఎవరనుకుంటున్నారా. అవును ఆయనే. మీరు ఊహించనాయనే. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. కరోనాతో కొన్నాళ్ల పాటు రాజకీయాలకు, ముఖ్యంగా విమర్శలకు దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి ఆసుపత్రి నుంచి డిస్చార్జి అయి వచ్చిన తర్వాత అసలు మాట్లాడడమే మానేశారు. అయితే గియితే చాలా పొదుపుగా, అరుదుగా మాట్లాడుతున్నారు.
కేవలం ట్విట్టర్లకే పరిమితం అవుతున్నారంటున్నారు. విజయసాయి రెడ్డి మౌనం వెనుక ఎలాంటి కారణం ఉందా అని పార్టీ నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డే మౌనంగా ఉండమని చెప్పారా… లేక ఆయనే వ్యూహాత్మకంగా మౌనముద్ర దాల్చారా అన్నది తేలాల్సి ఉంది.











