చైనా, వుహాన్ లో 2019 డిసెంబర్ లో పుట్టిన కరోనా వైరస్ దాదాపు 147 దేశాలకు పైగా వ్యాపించింది. ఈ మహమ్మారి బారిన ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా పడ్డారు. విషాదకరమైన విషయం ఏంటంటే ఈ వైరస్ 10 లక్షల మందికి పైగా పొట్టనబెట్టుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ఈ వైరస్ ను మహమ్మారిగా ప్రకటించింది. శ్వాసకోశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ వైరస్ కు ఎటువంటి మందులు లేవని వ్యాక్సిన్ వచ్చేవరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. ఈ వైరస్ నియంత్రణ కోసం సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని డబ్ల్యూ హెచ్ ఓ ప్రపంచ దేశాలకు సూచించింది. డబ్యూహెచ్ఓ సూచనలతో చాలా దేశాలు లాక్ డౌన్ ను విధించాయి.
సంపూర్ణ లాక్ డౌన్ విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. అత్యవసర సేవలు మినహ ఏ సేవలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. ముందస్తు సమాచారం లేకుండా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. ఈ లాక్ డౌన్ ప్రభావం మన భారతీయులపై ఎక్కువ ఉంది. ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విదేశాలలో ఉన్న భారతీయులు ఇండియాకి రాలేక అక్కడ ఉండలేక నరకయాతన పడ్డారు. ఉన్నత చదువుల కోసం వెళ్ళినవారు, ఆన్ సైట్ కు వెళ్లిన వారు, విదేశాలలో స్థిరపడ్డ తమ వారి కోసం వెళ్లిన వారు పరాయి దేశంలోనే చిక్కుకుపోయారు. మరి కొందరు ఇండియాలో ఉన్న తమ వారి కోసం విదేశాల నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది.
లాక్ డౌన్ నిబంధనలతో ఎక్కడి వారు అక్కడే ఉండి పోవలసిన పరిస్థితి ఏర్పడటంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపాలనుకునే వారి ఆశలు అడియాశలయ్యాయి. విదేశాలలో ఉన్న భారతీయుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. లాక్ డౌన్ తో ఆర్థిక అభివృద్ధి కుంటుపడటంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడమే గాక సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు.
వీసా నిబంధనలు కఠినతరం
వీసా గడువు ముగిసిపోవడం , ఆయా దేశాలు విదేశీయులపై విధిస్తున్న అదనపు ఆంక్షలతో భారతీయులు దిక్కుతోచక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యూఎస్ఏ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మన భారతీయులకు శరాఘాతంలా తగిలింది. స్వదేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం విదేశాల నుంచి వచ్చిన వారే కారణమంటూ ట్రంప్ హెచ్1బీ, ఎల్1 బీ, హెచ్ 4 వీసాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో కొంతమంది గ్రీన్ కార్డు దారులపై ఆంక్షలు విధించారు. ఈ సంవత్సరాంతం వరకు ఈ కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయి. వీసాల నిబంధనలను కఠినతరం చేయడం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపింది. వర్క్ పర్మిట్ రాక, క్లయింట్ లొకేషన్ కు ఇక్కడి నుంచి వెళ్లలేక చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. డిపెండెట్ వీసాలకు కూడా అనుమతి రాకపోవడంతో తల్లితండ్రులు, భార్యాభర్తలకు దూరంగా ఉండవలసి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకుంటున్న వారి బాధ వర్ణనాతీతం.
విద్యార్థుల వేదన
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారి భవిష్యత్తుతో ఈ వైరస్ చెడుగుడు ఆడుతోంది. స్టాంఫోర్డ్, కాలిఫోర్నియా, మిచిగాన్, వర్జీనియా, ప్రిన్స్టన్, యాలే, పిన్స్వలేనియా లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలలో మన దేశానికి చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా కారణంగా ఈ విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. క్లాసులు ఎపుడు మొదలవుతాయో తెలియదు..పరీక్షలు ఎపుడు నిర్వహిస్తారో తెలియదు..ఇండియాకి ఎప్పుడు రావాలో తెలియక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఒకప్పుడు చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసే విద్యార్థులకు ఆ అవకాశమే లేకుండా పోయింది. కరోనా కారణంగా అన్ని రకాల పార్ట్ టైం ఉద్యోగాలు లేకపోవడంతో వారికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. రుణాలు తీసుకొని యూఎస్ వెళ్లిన వారి పరిస్థితి మరి దారుణంగా తయారయింది. ఆర్థిక చేయూత లేకపోవడంతో వారే తల్లితండ్రుల మీద ఆధారపడవల్సి వస్తోంది.
నేర్చుకోవలసిన పాఠం
కరోనా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినా ఓ విషయంలో మాత్రం అది మనకు మంచి పాఠం నేర్పింది. ఉన్నత చదువులు, విదేశాలలో ఉద్యోగాల కోసం ఎక్కువ మంది భారతీయులు ఎందుకు వెళుతున్నారో ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల ప్రమాణాలకు ధీటుగా యూనివర్సిటీలని తీర్చిదిద్ది ; నైపుణ్యాలకు, అనుభవానికి తగ్గట్టుగా ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన బాధ్యత మన రాష్ట్ర,దేశ ప్రభుత్వాల మీద అంతే ఉంది. ఈ ప్రత్యామ్నాయ పరిస్కారాలను మన ప్రభుత్వాలు చూపగలిగితే మన భారతీయులు ఎక్కడికి వెళ్లకుండా ఇండియాలోనే ఉంటారని మేధావులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఎవరిని నిందించవలసిన అవసరం లేదు కానీ ఆశాజనకంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని కోరుకుందాం. ఇకనైనా ప్రభుత్వాలు మేలుకోవాలని ఆశిద్దాం. 2020లో మొదలైన ఈ వైరస్ 2020లోనే ముగిసిపోవాలని కోరుకుందాం!











