అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టులో స్వయంగా శంకుస్థాపన చేసి, హిందూ పరివారం చిరకాల స్వప్న సాకారానికి శ్రీకారం చుట్టారు. 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన స్థలంలోనే రామాలయ నిర్మాణం జరుగుతోంది. మసీదు ఉన్న స్థలమే రామజన్మభూమి అని హిందువులు అంటే, కాదు కాదు, అక్కడ బాబర్ కాలం నుంచి మసీదు ఉంది కాబట్టి దాని యజమానులం తామేనని ముస్లింలు వాదించేవారు. 1989లో రామ్ లల్లా విరాజ్ మాన్ తరఫున హిందువులు అయోధ్య స్థలం కోసం కోర్టుకెక్కారు. దశాబ్దాల న్యాయ వివాదం అనంతరం గతేడాది సుప్రీంకోర్టు ఈ స్థలాన్ని హిందూ భక్తులకు ఇచ్చింది.
ఇక ఇప్పుడు కృష్ణుడి వంతు వచ్చింది. మధుర సివిల్ జడ్జి కోర్టులో భగవాన్ శ్రీకృష్ణ విరాజ్ మాన్ తరఫున ఒక పిటిషన్ దాఖలైంది. మధురలో షాహీ ఈద్గా మసీదు ఆవరణలోని 13.37 ఎకరాల స్థలాన్ని కృష్ణ జన్మభూమిగా గుర్తించామనీ, దాన్ని కృష్ణ మిత్రులమైన తమకు అప్పగించాలని ఏడుగురు వ్యక్తులు కోర్టులో పిటిషన్ వేశారు. అలనాడు మొఘలులు ఇక్కడ ఒక ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని వారు ఆరోపించారు.
1669-70లో ఔరంగజేబు మధుర శ్రీకృష్ణ ఆలయంలో కొంత భాగాన్ని కూలగొట్టి ఈద్గా మసీదును నిర్మించినట్లు చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ రాశారని గుర్తుచేశారు. ‘100 ఏళ్ల తరవాత ఆగ్రా-మధుర ప్రాంతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్న మరాఠాలు ఈద్గా కట్టడాలను తొలగించి కృష్ణాలయాన్ని పునర్నిర్మించారు. 1803లో మధురను ఆక్రమించిన బ్రిటిష్ వారు కృష్ణాలయాన్ని యథాతథంగా కొనసాగించారు.1815లో ఇక్కడ 13.37 ఎకరాల స్థలాన్ని బ్రిటిష్ వాళ్లు వేలం వేయగా బెనారస్ రాజా పట్నీమల్ కొనుగోలు చేశారు‘ అని పిటిషనర్లు వివరించారు.
ఈ స్థలం తమదేనంటూ కొందరు ముస్లింలు వేసిన పిటిషన్ ను 1921లో స్థానిక సివిల్ కోర్టు కొట్టివేసింది. తరవాత ఈ భూమి పట్నీమల్ వారసుల నుంచి మదన్ మోహన్ మాలవీయ, జుగల్ కిశోర్ బిర్లాల చేతుల్లోకి మారింది. బిర్లా 1951లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ ట్రస్టుకు మొత్తం 13.37 ఎకరాలను అప్పగించారు. మధురలో షాహీ ఈద్గా మసీదు, శ్రీకృష్ణుడి ఆలయమూ పక్కపక్కనే ఉంటాయి. పై స్థలంపై మసీదుకు ఎలాంటి హక్కులూ లేకపోయినా మసీదు యాజమాన్యానికీ శ్రీకృష్ణ ట్రస్టుకూ 1968లో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు ప్రార్థన స్థలాలు శాంతియుతంగా మనుగడ సాగిస్తున్నాయి.
సదరు ఒప్పందానికి 1973లో స్థానిక కోర్టు ఆమోద ముద్ర వేసింది కూడా. కానీ, ఆ ఒప్పందం దురుద్దేశాలతో కుదిరింది కాబట్టి అది చట్టవిరుద్ధమని ఏడుగురు పిటిషనర్ల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వాదిస్తున్నారు. ఆలయ ఆస్తులను శ్రీకృష్ణ ట్రస్ట్ కైంకర్యం చేసిందనీ పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కృష్ణ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన హిందూ సైన్యానికి చెందిన 22మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉద్యమం 2022 ఉత్తర్ ప్రదేశ్ విధాన సభ ఎన్నికల్లో భాజపా గెలవడానికి తోడ్పడుతుందని సంఘ్ పరివార్ నమ్ముతోంది. మొత్తానికి రామబాణం తరవాత విష్ణు చక్రాన్ని పరివార్ చేపట్టబోతోందన్నమాట!
-అర్జున్