సినిమా హీరోలకు అభిమానులే కొండంత బలం. అలాంటి అభిమానుల కోరికలను నెరవేర్చడానికి మన హీరోలు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమాని విషయంలో అలాగే స్పందించారు. ఆ అభిమాని పేరు వెంకన్న. ఊరు నల్గొండ జిల్ల చండూరు. గతంలో అతనికి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో బస్ యాక్సిడెంట్ జరిగి స్పైనల్ కార్డు దెబ్బతింది. అతని శరీరం దాదాపు 90 శాతం స్పందించడంలేదు. ఆ కండరాల నొప్పితో అతను మంచం మీదే పడి ఉంటున్నాడు.
అతనికి ఉన్నది ఒక్కటే కల.. తన అభిమాన హీరో ఎన్టీఆర్ కలవాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. విషయం ఎన్టీఆర్ దాకా వెళ్లి పోయింది. వెంటనే ఎన్టీఆర్ స్పందించారు. వెంకన్నకు వీడియో కాల్ చేశారు. వెంకన్నను పరామర్శించి అతని కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. అతని ఆరోగ్యం కుదుట పడ్డాక వెంకన్నను కలిసి సెల్పీ ఇస్తానని హామీ ఇచ్చారు. వీరిద్దరి సంభాషణ ఎలా సాగిందో చూద్దాం.
వెంకన్న: అన్నా.. మిమ్మల్ని చూడాలని, కలవాలని చాలా రోజుల్నుంచి అనుకుంటున్నా. మీతో నాకో సెల్ఫీ కావాలి. అంతకుమించి నాకింకేమీ వద్దు.
ఎన్టీఆర్: తప్పకుండా మనం కలిసి మంచి ఫొటో దిగుతాం. ఈ కరోనా గోలంతా తగ్గాక నిన్ను నేను ప్రత్యేకంగా కలుస్తా. ఈలోపు నువ్వు బాగా తిని రెస్ట్ తీసుకో.
వెంకన్న: మిమ్మల్ని కలవాలనే ఆశతోనైనా మిమ్మల్ని కలిసే వరకైనా బతుకుతానన్నా.
ఎన్టీఆర్: అయ్యో.. నీకేం కాదు. నువ్వు ఎక్కడికెళతావు.. నీకేమీ కాదు.. ఇక్కడే ఉంటాం. నువ్వు మాత్రం తప్పకుండా బాగా రెస్ట్ తీసుకో. మంచి ఆహారం తీసుకో, జాగ్రత్తగా సంతోషంగా ఉండు.. నీ ఆనందమే నీకు ఆయుష్షు పోస్తుంది.
ఆ తర్వాత వెంకన్న తల్లితోనూ ఎన్టీఆర్ మాట్లాడారు. తనకు వీలైన సహాయాన్ని కూడా అందిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఇలాంటి అభిమానులకు హీరోలు ఈ తరహాలో పరామర్శించం మాత్రం అరుదుగానే జరుగుతుంటుంది. ఎంతో బిజీగా ఉండే హీరోలు తమ సమయాన్ని కొంతైనా ఇలా తమ అభిమానలు కోసం వెచ్చించడం మంచిదని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.