జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. తర్వాతి చీఫ్ జస్టిస్ కూడా ఆయనే అవుతారు. ఈ నేపథ్యంలో రమణకు వ్యతిరేకంగా ఒక పెద్ద వ్యూహం- ప్రణాళికాబద్ధంగా ఆచరణలోకి వచ్చింది. ఆ వ్యూహానికి కర్త, కర్మ క్రియ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండడం గమనించాల్సిన విషయం. రమణ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు సీజేఐకు ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. తనకు కావాల్సింది రమణ మీద ఫిర్యాదు, ఆయన మీద చర్య మాత్రమే కాదు.. ఆయన పరువు పోవడం కూడా అని వారు బలంగా అనుకున్నారో ఏమో గానీ.. ఆయన ప్రధాన సలహాదారు అజేయకల్లం స్వయంగా లేఖను మీడియాకు విడుదల చేసి.. ‘నోక్వశ్చన్స్’ అని ముగించారు.
అప్పటినుంచి జస్టిస్ రమణకు వ్యతిరేకంగా జగన్ ప్రకటించిన యుద్ధం నడుస్తూనే ఉంది. తమాషా ఏంటంటే.. యుద్ధాన్ని ప్రకటించిన హీరో ఇప్పటిదాకా ఎక్కడా తెరమీదికి ఎట్రీ ఇవ్వలేదు. ఇప్పటిదాకా అంత సైడ్ హీరోలు, కేరక్టర్ యాక్టర్‌లే నటిస్తున్నారు. క్యాస్టింగ్ కేవలం ఇంతవరకు మాత్రమే ఉంటే సరిపోదు.. సినిమా బాగా ఆడాలంటే వీరితో పాటు ఐటెమ్స్ కూడా ఉండాలి. ఆ సమతూకం గురించి వారు పట్టించుకున్నారో లేదో తెలియదు గానీ.. ఇప్పుడు రమణ మీద విషం చిమ్మడానికి ఒక కొత్త వ్యక్తి రంగంలోకి వచ్చారు. ఇలాంటి వ్యవహారాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు. వారికి అయినవారు, ఆశ్రితులు, అభిమానులు కూడా!
తాజాగొడవ ఏంటి?
బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండడానికి, సీజేఐ కావడానికి అర్హులు కారని ఆక్షేపిస్తూ సుప్రీం కోర్టులోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సుప్రీం న్యాయస్థానంలో ఒక పిల్ పడగానే.. సహజంగానే దానికి ఒక ఎక్నాలడ్జ్‌మెంట్ నెంబరు వచ్చింది. కేసు వేసినట్టుగా దీనిని రసీదుగా పరిగణించవచ్చు.
ఆ విధంగా ఒక పిల్ వేయగా.. రసీదు వచ్చిన వెంటనే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మొదలైపోయింది. జస్టిస్ రమణ మీద సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.. ఎడ్మిట్ చేశారంటూ ఎవరికి తోచినట్టు వారు ప్రచారంలో పెట్టేశారు. కేవలం పబ్లిసిటీ కోసం, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని కోర్టుకు తెలిస్తే, సుప్రీం వెంటనే డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఈ ప్రచారానికి కర్తలుగా బోరుగడ్డ అనిల్ కుమార్ అభిమానులు, అనుచరులు, మిత్రులు ఎవరైనా ఉంటారని మనకు అనిపిస్తుంది. ఆ కర్తల తెరవెనుక ఉండేదెవరో కూడా అందరికీ ఒక అభిప్రాయం కలుగుతుంది. మొత్తానికి ఇలా పిల్ వేయగానే.. దానిని సుప్రీం కోర్టు అనుమతించిందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా.. బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇంత హీరోయిక్‌గా సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన బోరుగడ్డ ఎవరా అనే ఆసక్తి కలుగుతుంది.
లోతుగా తవ్వితే అంతా దుర్గంధమే..
బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి గూగుల్ చేస్తే ప్రాథమికంగా చాలా వివరాలు వస్తాయి. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్. బోరుగడ్డ అనిల్ సైన్యం తదితర రూపాల్లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెలియజెప్పే అనేక ఫేస్ బుక్ పేజీలు కూడా కనిపిస్తాయి. ఎవరో గొప్ప వ్యక్తే ఏమో అనే అభిప్రాయం కలుగుతుంది.
కానీ ఇంకాస్త లోతుగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఆశ్చర్యపోతాం. మెసాలు, నకిలీలలు, బెదిరింపు దందాలు, పెద్ద పెద్ద అధికార్లనే బురిడీ కొట్టించడం, కోర్టులో కేసులు వేయడం ద్వారా.. పాపులారిటీ పెంచుకోవడం, ఆ పాపులారిటీతో మళ్లీ దందాలు చేయడం ఇదంతా అతని నిత్యకృత్యాలని అర్థమవుతుంది. తవ్వుకుంటూ పోయే కొద్దీ.. దుర్గంధం కొడుతుంది. ఇవన్నీ గమనిస్తే అతనొక ఫ్రాడ్‌స్టర్ అనిపిస్తుంది.
బోరుగడ్డ అనిల్.. క్రిస్టియన్ సంస్థలతో స్వయంగా సంబంధం ఉన్న వ్యక్తి. గుంటూరు నివాసి. గుంటూరు కేంద్రంగా పనిచేసే సైమన్స్ అమృత్ ఫౌండేషన్స్‌కు ఆయనే ఫౌండర్ మరియు ప్రెసిడెంట్, ఇది క్రిస్టియన్ మిషనరీ సంస్థ. గుంటూరు అరండల్ పేటలో ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది. సాధారణంగా ఉన్నత విద్య చదివిన వారు పేరు పక్కన డిగ్రీ పెట్టుకుని, దాని పక్కన బ్రాకెట్లలో విదేశాల్లో చదివిఉంటే ఆదేశం పేరు పెట్టుకుంటారు. డిగ్రీ ఇంకా చదువుతూ ఉంటే.. డిగ్రీని బ్రాకెట్లలో పెట్టుకుంటారు. మరి బోరుగడ్డ సంగతేంటో మనకు తెలియదుగానీ.. ఆ సంస్థ బోర్డు మీద డిగ్రీ బ్రాకెట్లలోనే లండన్ అనే పెద్దక్షరాలు బ్రాకెట్లు లేకుండానూ ఉంటాయి. బహుశా ఆయన లండన్ లో ఎంబీయే జాయిన్ అయ్యారేమో అనిపిస్తుంది. రోడ్డు మీద పెట్టిన బోర్డు దగ్గరినుంచి ఆయన మతలబు వ్యవహారాలు మొదలవుతాయి. వాటిలో కొన్ని జాబితా కడితే..
1. గతంలో అమరావతి ప్రాంతంలో.. భూదందాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కారు.
2. ఓ భూవివాదంలో డిప్యూటీ సీఎం హోమంత్రి పేరు చెప్పుకుని నేరాలకు పాల్పడ్డారు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు.
3. క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ, రమణ దీక్షితులు పక్కన కూర్చుని, చంద్రబాబు పై దాడి చేసాడు.. విమర్శలు కురిపించారు.
4. మత ప్రచారాల పేరుతొ ఫారన్ ఫండ్స్ పెద్ద మొత్తంలో స్వీకరిస్తుంటాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
5. జగన్ కోడి కత్తి కేసులో కూడా అప్పట్లో హైకోర్టులో కేసు వేసాడు
6. కోడెల మృతి పై, ఆయన చనిపోయిన తరువాత ఆయన ఒక కేసు వేశారు.
7. ఏకంగా ఎస్పీలను బెదిరించి దందాలు చేసే వాడనే ప్రచారం కూడా ఉంది.
8. కేంద్ర మంత్రి ఓఎస్డీ అంటూ, ఐఏఎస్ ఆఫీసర్ ని అంటూ మారు పేర్లతో దందాలు చేసే వాడనే ఆరోపణలు, కేసులు కూడా ఉన్నాయి.
టీవీఛానెళ్లు క్రమంతప్పకుండా చూసే వారికి బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా పాపులర్ వ్యక్తి.. ఆయన పలుమార్ల అరెస్టు అయ్యారు కూడా. బోలెడుసార్లు టీవీ న్యూస్ లో ఆయన ప్రధానాకర్షణగా మారిన సందర్భాలున్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలను చూడవచ్చు..
బోరుగడ్డ అనిల్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే.. ఆయన చంద్రబాబును నిందించే తూలనాడే అనేక వీడియోలు కూడా వస్తాయి. ఎటూ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటూ తెలుగు రాష్ట్రాల్లో దిక్కూ మొక్కూ లేని ఒక గాలివాటు పార్టీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనే హోదా ఒకటి ఉన్నది గనుక.. ఆయన తన ఇష్టమొచ్చినట్లుగా చెలరేగుతూ ఉంటారన్నమాట.
కామెడీ ఏంటంటే.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు మీద.. టీటీడీ అర్చకుడు రమణ దీక్షితులు ఎడాపెడా ఆరోపణలు చేస్తున్న సమయంలో.. ఆయనతో పాటు.. ఈ క్రిస్టియన్ మిషనరీ సంస్థల ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కూడా దీక్షితులకు మద్దతు ఇవ్వడం- నిందలు వేయడం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడెల్లా.. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఉపయోగపడే అనేకానేక మంది వ్యక్తుల్లో ఈ బోరుగడ్డ అనిల్ కూడా ఒకరనే ప్రచారం ఉంది.
ఇలాంటి వ్యక్తిని ఎంచుకుంటే పరువు పోదా?
ముందే అనుకున్నట్టు వైఎస్సార్ సీపీ రమణ మీద యుద్ధం సాగిస్తోంది. ఆయనను భ్రష్టు పట్టించడానికి ఎన్ని రకాల వ్యూహాలు పన్నవచ్చో.. అన్ని పనులూ చేస్తోంది. కాకపోతే.. బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి ప్రజల దృష్టిలో ఫ్రాడ్‌స్టర్‌లుగా ముద్రపడిన, అనేక నేరాలు, మోసాలు కేసులతో ప్రమేయం ఉన్న, పలుమార్లు జైలుకు వెళ్లిన.. సమాజంలో మోసగాడిగా ప్రచారంలో ఉన్న వ్యక్తులను ఎందుకు ఎంచుకుంటోంది అనేది ఆ పార్టీ వారికి కూడా కలుగుతున్న సందేహం.
జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండే వీరాభిమానులు రాష్ట్రంలో కొల్లలుగా ఉంటారు. సుప్రీం న్యాయమూర్తి మీద సవాలు చేయడానికి అలాంటి వారిని ప్రేరేపిస్తే ఫేక్ పితూరీలు చేసి జైలుకు వెళ్లడానికి కూడా తయారవుతారు. కానీ బోరుగడ్డ లాంటి వారి వల్ల పార్టీ పరువు బజార్న పడుతోంది.
పిల్ అంటే అంత చీప్ అయిపోయిందా..
సాధారణంగా పిల్- ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే.. సమాజం హితం కోరుకునే వారు అనుసరించే మార్గం. అధికార రాజకీయ వ్యవస్థలు కూడా పట్టించుకోకపోయినప్పుడు, ఆ వ్యవస్థలు అచేతనంగా మారినప్పుడు, ఆ వ్యవస్థల్లోనే లోపాలు ఉన్నప్పుడు.. సాధారణ వ్యక్తి అయినా సరే.. న్యాయవ్యవస్థను ఆశ్రయించి మొత్తం వ్యవస్థలో మార్పు- కదలిక తీసుకురావడానికి ఉద్దేశించింది పిల్- ప్రజాప్రయోజన వ్యాజ్యం.
సాధారణంగా, మేధావులు, సంఘహితం కోరుకునే పెద్దలు, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాన్ని కూడా గుర్తించగలిగిన తెలివైన వాళ్లు, పరిష్కారాల్ని సూచించగలిగిన ఆలోచన పరులు పిల్ వేస్తుంటారు. కానీ కాలక్రమంలో రాజకీయ కక్ష సాధింపులకోసం, రాజకీయ ప్రాపకం కోసం, ఒకరిని ప్రసన్నం చేసుకోవడం కోసం.. ద్వేషాన్ని, విషాన్ని నింపి.. వ్యక్తి ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజాప్రయోజన వ్యాజా్యలు వేయడం మామూలు అయిపోయింది. ఇంత కరడుగట్టిన నేరస్తులు తప్ప.. జస్టిస్ రమణ మీద ఒక పిటిషన్ వేయించడానికి ఆయన ప్రత్యర్థులకు వేరే వ్యక్తే దొరకలేదా.. అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.