ఏపీ సచివాలయంలో అధికారుల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేయడం, టీడీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసిన పనులకు బిల్లులు నిలిపివేయడం, కరోనా ఎఫెస్ట్ ఇవన్నీ అధికారుల పనితీరుపై ప్రభావం చూపుతున్నారు. దీనికితోడు వైసీపీ పథకాలన్నీ నగదు బదిలీ తరహావి కావడంతో చాలా మందికి పనిలేకుండా పోయింది. దీంతో చాలా మంది అధికారులు ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి వచ్చి, మూడు గంటలకే సర్దేస్తున్నారు. దీంతో ఏపీ సచివాలయం బోసిపోతోంది.
మింగలేక కక్కలేక
ఏపీలో అధికారుల తీరు మింగలేక కక్కలేక అన్న తీరుగా తయారైంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనే అనుమానాలతో నో డెషిషన్ ఈజ్ ద బెస్ట్ డెషిషన్ అనే సూత్రం పాటిస్తున్నారు. దీనికితోడు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రూ.6000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేయించిన పనులకు బిల్లులు నిలిపివేశారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆయా శాఖల అధికారులను కలవడానికి వస్తున్నారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక ఉన్నతాధికారులు సైతం తప్పించుకుతిరుగుతున్నారని తెలుస్తోంది. దీంతో అధికారులు సచివాలయానికి రావడమే తగ్గించారు. ఒకవేళ వచ్చినా సీట్లో కూర్చోడానికి సాహసించడం లేదు. ఏదో మీటింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
అంతా అక్కడి నుంచే
ఏపీ పాలనమొత్తం తాడేపల్లిలోని సీఎం ఇంటి నుంచే సాగుతోంది. ముఖ్యమైన మీటింగులు సైతం అక్కడే జరుగుతున్నాయి. అందుకే ఉన్నతాధికారులు సైతం సచివాలయానికి రావడం తగ్గించారు. సీఎం ఇంట్లో సమావేశం ఉంటే హాజరుకావడం, ఇక అటునుంచే సర్దుకోవడం ఇదీ అధికారుల తీరు. దీంతో ఏపీ సచివాలయం తరలించకముందే బోసిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి రోజూ 4 వేల మంది సందర్శకులు వివిధ పనులపై వచ్చే వారు. నేడు పట్టుమని వంద మంది కూడా రావడం లేదని ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. ఒక విధంగా ఇది కూడా వారికి బాగానే ఉంది.
నేటికీ చాలా మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చలేదు. సచివాలయంలో పనిచేసే చాలా మంది ప్రభుత్వోద్యోగులకు హైదరాబాద్ లో సొంత ఇళ్లు ఉండటంతో ఎవరూ ఫ్యామిలీతో విజయవాడకు రాలేదు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్లిపోవడం, సోమవారం 12 గంటలకు మరలా కార్యాలయాలకు చేరుకోవడం చేస్తున్నారు. ఇక మూడు రాజధానుల ప్రకటనతో ఇక పనిచేయాలన్న ఉత్సాహం కూడా ప్రభుత్వోద్యోగులు చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇదీ సంగతి..
ప్రభుత్వ ఉద్యోగులను గట్టిగా పనిచేయిస్తే, వారికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను లేవనెత్తే అవకాశం ఉంది. అందుకే వైసీపీ నేతలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. పనిచేయమని ప్రభుత్వ ఉద్యోగులపై ఏ మాత్రం ఒత్తిడి తేవడం లేదు. మీకు ఇష్టం అయితే చేయండి, లేదంటే ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించరు అన్న చందంగా తయారైంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ఇచ్చిన అనేక హామీలు తుంగలో తొక్కినా ఎవరూ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు వైసీపీ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటోన్నట్టు భావించాల్సి వస్తోంది. వీరి క్రీడలో సాధారణ జనం మాత్రం సచివాలయంలో ఒక్కపనీ కాక ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లిపోతున్నారు.











