అమరావతి రాజధానిని మూడు ముక్కులు చేస్తూ తుగ్లక్ సీఎం తీసుకున్న నిర్ణయానికి 29 గ్రామాల రైతులతో పాటు, ఏపీ ప్రజలు బలయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. అమరావతి రైతులు 500 రోజులుగా ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి ప్రజా రాజధానిని కాపాడుకునేందుకు రైతులు, మహిళా రైతులు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని ఆయన కొనియాడారు. అంతిమ విజయం రైతులదేనని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతుల త్యాగం ఊరికే పోదు: లోకేష్
అమరావతి రైతుల త్యాగం ఊరికే పోదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 500 రోజులకు చేరిన సందర్భంగా ఆయన అన్నారు. ప్రజారాజధాని కోసం రైతులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయిన అమరావతిని కొనసాగించి ఉంటే రాష్ట్రానికి పెద్ద అసెట్ అయ్యేదని లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. చివరకు అంతిమ విజయం రైతులదేనని ఆయన అన్నారు. 500 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తోన్న రైతులు, మహిళా రైతులకు లోకేష్ ఉద్యమాభినందలు తెలిపారు.