ఆంక్షల వాకిట అడుగుపెడితే అరెస్టేనా?
రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ సాధించుకునేందుకు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగార్చాలని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు వంటి 71 డిమాండ్స్ ను వారంలో పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ హామీని మరిచి మడం తిప్పారు. నమ్మి రెండు చేతుల్తో ఓట్లేసి గెలిపించినందుకు ఇచ్చిన హామీని నేడు నెరవేర్చాలని కోరుతున్న ఉద్యోగులను నీచాతి నీచంగా చూసి.. అవమానించడం ఎంత వరకు సబబు? ప్రజల, ఉద్యోగుల ఛీత్కారాలకు గురైన ఏ ఒక్క ప్రభుత్వం, ఏ ఒక్క రాజకీయ పార్టీ చరిత్రలో మనుగడ సాగించడం అన్నది కల్ల! అటువంటిది ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసి సాధించేది ఏమీ లేదు. పక్కన రాష్ట్రాల్లో అమలౌతున్న పీఆర్సీ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోనైనా సీఎం జగన్ రెడ్డి సమానంగా కాకపోయిన స్వల్ప వ్యత్యాసంతో పీఆర్సీ ప్రకటిస్తే.. నేడు ఈ ఉద్యయం పురుడుపోసుకుని ఉండేది కాదు కదా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘చలో విజయవాడ’ కు అనుమతులు లేవని, ప్రభుత్వం చెబుతుంటే.. కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ఉద్యోగులు భీష్మించారు. ఈ నేపథ్యంలో విజయవాడను పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. ఆంక్షల నడుమ వాహనాలు, బెజవాడలో అడుగు పెడుతున్న బయట వ్యక్తులపై నిఘా పెంచారు. అడుగుడుగునా చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి అప్రమత్తం చేశారు పోలీసులు. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను, కార్లు, లారీలులను కూడా వదలకుండా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు మారువేషాల్లో విజయవాడకు తరలివస్తున్నారు. ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగులపై ఉక్కుపాదాన్ని ప్రజలు మరవరు!
ఉద్యోగుల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తునే ఉన్నారు. ఉద్యోగు న్యాయమైన వినతులను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అందులో మడమ తిప్పని హామీలిచ్చి.. ఇప్పుడు అడుగుతున్నారని వారిని దూరం పెడితే ఎలా? అన్నదే రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘చలో విజయవాడ’ కు పిలుపునిస్తే ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్భంధాలు, అధికారులు, పోలీసులతో బెదిరింపులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా జగన్ రెడ్డి అవలంబిస్తున్న నియంతృత్వ ధోరణిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్భంధకాండను ప్రశ్నించారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్ తో పాటు ఇతర అలవెన్సులు అమలు చేయాలని డిమాండ్స్ సర్వత్ర వినిపిస్తున్నాయి.
Must Read:-ప్రజాస్వామ్య మూల స్తంబాలు కుప్పకూలాయి..! ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం?!