‘చలో విజయవాడ’ నిర్వహించి తీరుతాం..!
రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను ఎండగడుతూ.. ఉద్యోగులు ఐక్యతను చాటేందుకు తలపెట్టిన ‘చలో విజయవాడ’పై జగన్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కుట్రలు పన్నుతోంది! కార్యక్రమంలో పాల్గొనకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముందస్తు నోటీసులను పోలీసు శాఖ బుధవారం అందజేసింది. ఇంటి నుంచి కాలుబయటపడితే అరెస్ట్ చేస్తామని నేరుగా ఎన్జీవో నేతలకే నోటీసులను అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్యోగ సంఘాల నేతలను గృహ నిర్భంధం చేశారు పోలీసులు. విజయవాడ వెళ్లేందుకు టాక్సీలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని టాక్సీ యూనియన్లకు కూడా పోలీసులు హెచ్చరించారు. రూల్స్ ను బ్రేక్ చేస్తే.. లైసెన్స్ లను కూడా రద్దు చేస్తామని ఆడియో మెసేజ్ లు పంపారు.
అండర్ గ్రౌండ్‌కి ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగ సంఘాల నేతలు అండర్ గ్రౌండ్ కు వెళ్లారు. పోలీసులు హౌస్ అరెస్ట్ లతో ఫోన్ లు స్విచ్ఛాఫ్ చేశారు. ముందస్తు అరెస్ట్ లకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. అండర్ గ్రౌండ్ కి వెళ్లిన నేతల ఆచూకీ కోసం పోలీసు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాన్ని ఎంత అణగదొక్కాలని చూసిన ‘చలో విజయవాడ’ను నిర్వహించి తీరుతామని జేఏసీ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు. కరోనా పేరుతో చలో విజయవాడకు ఉద్యోగులు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ముందస్తుగా ఎక్కడికక్కడ ఉద్యోగస్తులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడతోపాటు గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతి లేదంటూ పోలీసులు, మరోవైపు ‘చలో విజయవాడ’ నిర్వహించి తీరుతామని ఉద్యోగుల పట్టుదలతో విజయవాడలో హైటెన్షన్ వాతావరణం అలుముకుంది!
Must Read:-‘చలో విజయవాడ’ కు నో పర్మిషన్ .. అడుగు బయట పెడితే అరెస్ట్ లేనా?!











