పాత్ర డిమాండ్ చేస్తే .. ఎలాంటి కష్టమైనా పడతారు మన టాలీవుడ్ హీరోలు. డిఫరెంట్ మేకోవర్ కోసం .. తమ శరీరాకృతిని కూడా మార్చుకోడానికి సిద్ధమవుతారు. ఇప్పుడు అలాంటి ఓ సీజన్ ఒకటి నడుస్తోంది. అవునండీ… అదేం విచిత్రమో కానీ… టాలీవుడ్ లో ఓ ముగ్గురు హీరోలు.. తమ తమ సినిమాల్లో విల్లంబులు ధరించి .. యుద్ధరంగంలోకి దిగబోతున్నారు. ఇలా ఒకేసారి ధనుసు, బాణాలతో విరుచుకుపడుతున్నారంటే… అది ఖచ్చితంగా శత్రు సంహారం కోసమే అయి ఉంటుంది.
ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ … కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. అది అలాంటిలాంటి సినిమా కాదు. ఏకంగా రూ. 500కోట్ల పైచిలుకు బడ్జెట్ తో .. పాన్ ఇండియా రేంజ్ లో… బహుభాషల్లో తెరకెక్కబోతోంది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. దాని పేరు ‘ఆదిపురుష్’. రామాయణంలోని ఒక ఘట్టాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా నటించబోతుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రావణుడిగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడని, అలాగే.. సీత పాత్ర కోసం మల్లూ కుట్టి కీర్తి సురేశ్ ను సంప్రదించారని వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ సినిమా కోసం ప్రభాస్ విలు విద్యలో శిక్షణ తీసుకుంటున్నట్టు ఓం రౌత్ ఇటీవల ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. రాముడు పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి.. ఆ పాత్ర విల్లు ఎక్కపెట్టడం క్వైట్ కామన్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ … తారక్ తో కలిసి … ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడని కూడా తెలిసిందే. అందులో చరణ్ .. విల్లంబులు ధరించడం అందరినీ ఆకర్షిస్తోంది. చెర్రీ పుట్టిన రోజు సందర్బంగా.. తారక్ రిక్వెస్ట్ మేరకు జక్కన్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకు సంబంధించిన ఒక వీడియో విడుదల చేసి.. అభిమానుల్ని అలరించాడు. అందులో రామ్ చరణ్ .. కసరత్తులు చేసి.. శరసంధానం చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. పాత్ర అల్లూరి సీతరామరాజు కాబట్టి.. ఆ పాత్ర డిమాండ్ మేరకు చెర్రీ.. విల్లు ఎక్కుపెట్టడం సమంజసమే అనిపిస్తుంది.
ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో హీరో నాగశౌర్య. ఎర్లియర్ గా ‘అశ్వథ్థామ’ మూవీతో మంచి విజయం సొంతం చేసుకున్న మనోడు…ఇటీవల తన 20వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగశౌర్య… విల్లు ఎక్కుపెడుతూ.. యోధుడిగా రివీల్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలోని కథతో సినిమా తెరకెక్కనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సిక్స్ ప్యాక్ బాడీతో విల్లంబులు చేతబట్టిన నాగశౌర్య లుక్ కు మంచి స్పందన లభించింది. మొత్తానికి ఈ హీరోలందరూ ఒకేసారి విల్లంబులు చేతబట్టడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ ముగ్గురిలోనూ ఏ హీరో పైచేయి సాధిస్తాడో చూడాలి.











