(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అంటున్న రాష్ట్ర ప్రభుత్వ వాదన కరెక్టా? లేక అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగాలంటున్న ప్రతిపక్ష పార్టీలు వాదనలో నిజమెంత? అలాగే అమరావతి ఒక్కటే ఏకైక రాజధాని గా ఉండాలని అంటూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన ఏమేరకు సమంజసం అన్న మీమాంస నేడు రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకోవచ్చా? అసలు దేశంలో ఎక్కడన్నా ఈవిదంగా పరిపాలన రాజధాని, శాసనపరమైన రాజధాని, న్యాయ రాజధాని ఆంటూ ప్రత్యేకంగా మూడు రాజధానులు ఉన్నాయా? అన్న సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోను తలెత్తుతోంది.
పాలనా సౌలభ్యo కోసం, రాజధాని ఉన్న ప్రాంతం కాకుండా హైకోర్టును వేరే ప్రాంతంలో కొనసాగిస్తున్న రాష్ట్రాలు కొన్ని ఉండగా, అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి శీతాకాలంలో వేరొకప్రాంతంలో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా ప్రస్తుతం ఉన్న రాజధాని ప్రాంతం అన్నివిధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ పరిపాలనా వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి పరిపాలన సాగిస్తున్న రాష్ట్రాలు మన భారతదేశంలో ఎక్కడా లేవు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవటంతో అమరావతి ప్రాంతాన్నిగత తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందుకోసం దాదాపు 33,000 ఎకరాల భూమిని ఆప్రాంత రైతుల నుండి రాష్ట్ర ప్రభుత్వం సేకరించగా ఇందుకు రైతులుకుడా సహకరించి తమ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్చందంగా ఇచ్చారు. ఆ పిదప అప్పటి ప్రభుత్వం 45 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనాలను, 1.2 లక్షల చ.మీ. విస్తీర్ణం లో శాసనసభ భవనాలను, 8 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు భవనాలను నిర్మించారు.
అనంతరం ఆ సచివాలయం భవనాలలోనే కలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. అలాగే శాసనసభ సమావేశాలు కూడా అమరావతి నుంచే నిర్వహించారు. అదేవిధంగా హైకోర్టు కార్యకలాపాలు కూడా ఇక్కడ నుండే కొనసాగిస్తున్నారు. వీటి నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హైకోర్టు భననాలను ప్రారంభించారు. వీటితో పాటు ముఖ్య కార్యదర్శకులకు, ఐ.ఏ.ఎస్. అధికారులకు, సచివాలయ అధికారులకు, సిబ్బంది నివాసానికి, మంత్రులు,శాసనసభ్యుల నివాసానికి అవసరమైన భవనాల నిర్మాణాన్ని 70 శాతం మేరకు పూర్తి అయ్యాయి. అలాగే మరికొన్ని పరిపాలన భవనాలను కూడా నిర్మించారు.
రాజధాని నిర్మాణం లో భాగంగా తొలిదశలో 51,687 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా అందులో 41,678 కోట్ల తో చేపట్టిన పనులు గ్రౌండ్ అయినట్లు గత ప్రభుత్వం పేర్కొంది. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అధికారం లోకి వచ్చిన వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ప్రతిపాదనను తీసుకు రావటంతో ఆంధ్రప్రదేశ్ రాష్టాన్నికి రాజధాని ఏదో తెలియని పరిస్థితి ఏర్పడింది. మూడు రాజధానులు అంటూ అధికార వైసీపీ నేతలు, కాదు అమరావతి యే రాజధాని అంటూ ప్రతిపక్షాలు, తమ అమరావతి ఒక్కటే ఏకైక రాజధాని అంటూ ఆప్రాంత రైతాంగం తమ తమ వాదనలు, ఉద్యమాలతో హోరెతిస్తున్నాయి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అంటూ పలువురు మేధావులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉండగా ఆంధ్రప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ ఉంటే పరిపాలన ఏవిదంగా కొనసాగుతుంది అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తెలుసుకోవటం సమంజసం. అలాగే రాష్ట్ర రాజధాని వంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రిఫరెండం జరిపి ప్రజల నిర్ణయాన్ని తీసుకోవటం సారి అయిన చర్య. కొన్ని దేశాలలో రెఫరెండం జరిపి ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారు గదా అని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇక్కట్లకు గురిచెయ్యటం సమంజసం కాదు.
రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు గత 250 రోజులుగా మహిళలు,పిల్లలతో సహా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో ఇప్పటివరకు 85 మంది రైతులు అసువులు బాశారు. ఐనప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకుండా, రైతాంగం చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోవటం సహేతుకం కాదు అనే అభిప్రాయమే ఎక్కువమందిలో వ్యక్తం అవుతోంది.











