“కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. నా వ్యక్తిగత వెబ్ సైట్ ను హ్యాక్ చేసింది“ ఇవి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. ఆయన వ్యక్తిగత వైబ్ సైట్ kishanreddy.com ను పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారని ఆయన కార్యాలయం స్యయంగా ధ్రువీకరించడం ఇక్కడ చర్చనీయాంశం అయ్యింది. నిజానికి ఆగస్టు 15నే ఆయన వెబ్ సైట్ హ్యాక్ అయింది. అందులో పాక్ అనుకూల నినాదాలు పెట్టారు. ప్రస్తుతం వాటిని తొలగించి, వెబ్ సైట్ ను ఓపెన్ కాకుండా ఉంచారు.
కిషన్ రెడ్డి సాధారణ మనిషి కాదు. దేశానికి హోం శాఖ సహాయ మంత్రి. పైగా అమిత్ షా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు కనుక ఒక విధంగా దేశానికి ప్రస్తుత హోం మంత్రి జీ.కిషన్ రెడ్డే. అలాంటి ఆయన వ్యక్తిగత వెబ్ సైట్ హ్యాక్ అయ్యిందంటూ ఆయనే ప్రకటించడం దేశంలో అంతర్గత భద్రత ఎంత బాగుందో అర్ధం చేసుకోవచ్చు.
ఇంతకు ముందు దేశానికి చెందిన బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల వెబ్ సైట్లను హ్యాక్ చేసిన పాక్ హ్యాకర్లు ఆ తర్వాత రక్షణ రంగానికి చెందిన వెబ్ సైట్లను హ్యాక్ చేయడం ప్రారంబించారు. ఇది ఆ సమయంలో కలవరపాటుకు గురి చేసింది. అయితే దాని నుంచి బయటపడింది. రక్షణ శాఖ. కీలక సమాచారమేది బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది.
ఆ తర్వాత మళ్లీ ఇదిగో… ఇప్పుడు హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ ను హ్యాక్ చేశారనే వార్త స్వయంగా ఆయనే ప్రకటించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన వెబ్ సైట్ ను పాక్ హ్యాకర్ల నిజంగానే హ్యాక్ చేసినా ఆ స్థాయిలో నాయకుడెవరు దాన్ని బయటపెట్టరు. అది అంతర్గత భద్రతకు సంబంధించిన కీలకాంశం అవుతుంది. ఇప్పుడు హోం మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనతో భద్రత విషయంలో అనేకానేక అనుమానాలు తలెత్తే అవకాశాలూ ఉన్నాయి.
పైగా కేంద్రప్రభుత్వ వెబ్ సైట్ల హ్యాకింగ్ కు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్య కిషన్ రెడ్డి చేసినట్టుగా రావడం ఆందోళనకరం. హ్యాకర్లకు అది వ్యక్తిగత వెబ్ సైటా లేక అధికారిక వెబ్ సైటా అన్నది ముఖ్యం కాదు. ఎక్కడ ఎలాంటి సమాచారం దొరికినా దాన్ని అందుకోవడమే వారి లక్ష్యం. దాని ద్వారా దేశాన్ని అస్థిరపరచడమే వారి ఉద్దేశ్యం. పైగా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో సమచారం కంటే వ్యక్తిగత వెబ్ సైట్ మరింత కీలక సమాచారం లభ్యమైతే అది దేశానికి ఎంత ముప్పో కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డికి తెలియాలి కధా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి కేంద్ర హోమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన దేశ అంతర్గత భద్రతపై మరిన్ని ప్రశ్నలు సంధిస్తోంది.