రాజకీయంగా ప్రత్యర్థిని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు ఆర్థికమూలాలపై అస్త్రాలు ఎక్కుపెట్టడం కొత్త యుద్ధనీతి కాదు. ఏపీలో టీడీపీ విషయంలో వైసీపీ అధిష్టానం ప్రస్తుతం అదే పని చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీలో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న నేతలపై గురిపెట్టారు. ఇందులో ప్రధానంగా గ్రానైట్ వ్యాపారులు ఉన్నారు. వారి లీజుల రద్దు వ్యవహారం తాజాగా చర్చనీయాంశం అవుతోంది.
ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ఈ వ్యాపారంలో రెండు దశాబ్దాలుగా రాణిస్తున్న టీడీపీ నేతలపై వైసీపీ గురిపెట్టింది. ఇందులో భాగంగా మొదటి దశలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్దారాఘవరావు గ్రానైట్ కంపెనీలతో పాటు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులకు చెందిన 26 గ్రానైట్ కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. వైసీపీలో చేరితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని లేదంటే మీ పరిశ్రమలు మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు గుసగుసలు వినిపించాయి.
వ్యాపారం లేకుంటే కష్టమని భావించిన శిద్ధా రాఘవరావు, ఆయన సోదరులతోపాటు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరిపోయారు. ఇక ఆ జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా మారిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు హైకోర్టును ఆశ్రయించారు. గ్రానైట్ గనుల లీజుల రద్దు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఖంగుతిన్న ప్రభుత్వం వెంటనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులను రంగంలోకి దింపింది. వారి గ్రానైట్ పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోందని అందుకే లీజులు రద్దు చేస్తున్నామని హైకోర్టుకు వెల్లడించారు.
టీడీపీకి ఆర్థిక సంకెళ్లే లక్ష్యం
తెలుగుదేశం పార్టీని ఆర్థకంగా కోలుకోలేకుండా చేసి 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలిగిన అభ్యర్ధులు లేకుండా చేయాలని పావులు కదుపుతున్నారు. టీడీపీకి ఏ జిల్లాలో ఏ నాయకులు ఆర్థిక సాయం చేస్తున్నారో ఇంటిలిజెన్స్ నుంచి రిపోర్టులు తెప్పించుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఐదారుగురు టీడీపీ నేతల వ్యాపారాలను దెబ్బతీస్తే ఇక ఆ జిల్లాలో టీడీపీని కోలుకోలేని దెబ్బతీయవచ్చని ప్రత్యర్థులు భావిస్తున్నారు. అందులో భాగంగానే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు చెందిన 11 గ్రానైట్ కంపెనీల లీజులను రద్దు చేశారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ దాదాపు పూర్తయినట్టే. ఇద్దరు ప్రధాన నేతలు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ఇద్దరు కీలక నేతల వ్యాపారాలను మూసివేయించారు. ఇక మిగిలింది అగ్రిటెక్ అధినేత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. ఆయన వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వ్యవసాయంలో వాడే మైక్రోన్యూట్రియంట్స్ తయారు చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏలూరి సాంబశివరావు కూడా వైసీపీలో చేరుతున్నారంటూ కొన్ని నెలల కిందట తీవ్ర ప్రచారం జరిగింది. చివరకు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మారడం లేదంటూ చెప్పాల్సి వచ్చింది.
ప్రకాశం టీడీపీకి తీవ్ర నష్టం
జిల్లాలో ప్రధానంగా ఆరుగులు వ్యక్తులే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వారే కీలకంగా మారుతున్నారు. అందుకే వారిని దెబ్బతీస్తే ప్రకాశం జిల్లాలో టీడీపీ పని అయిపోయినట్టేనని వారిపై కాన్సంట్రేట్ చేసినట్టు సమాచారం. అయితే ప్రకాశం జిల్లాలో టీడీపీకి సామాజికవర్గ బలంలోపాటు, క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలాబలాలు మరోసారి తేలనున్నాయి. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ దాదాపు పూర్తయినట్టే.











