అనంతపురం ప్రభుత్వఆస్పుత్రిలో అగ్నిప్రమాదం.వ్యవహారం తాజాగా కలకలం రేపుతోంది. ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది రికార్డురూంలోనే కావడం వల్ల ప్రాణనష్టం జరగలేదు. రికార్డు రూమ్ లో షార్ట్ సర్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అయితే దానికి పక్కనే 30 మంది కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసోలేషన్ వార్డు ఉంది. ఏ అవాంఛనీయ పరిణామాలు జరిగి ఉన్నా సరే.. నష్టం చాలా తీవ్రంగా ఉండేది.
మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది, పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఐసొలేషన్ వార్డులోని కోవిడ్ బాధితులను వేరే వార్డుకు తరలించారు. ఈ విషయంలో ఆస్పత్రి అంతటా గందరగోళం నెలకొంది.
ప్రమాదం సంగతి తెలియగానే ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అనంత పరిశీలించారు. కరెంట్ వైర్లు పాతవి కావడం వల్ల షాట్ సర్క్యూట్ జరిగి కొన్ని రికార్డులు దగ్దమైయ్యాయని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడం వల్ల ఎవ్వరికి ఏలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు అంటున్నారు. ఎమ్మెల్యే అనంత కోవిడ్ పేషెంట్లను పరామర్శించారు.
బాధ్యత ఎవరిది?
ఆస్పత్రులు/ కొవిడ్ కేంద్రాల్లో అగ్నిప్రమాదాలు అనేది ఒక శాపంలా మారినట్టుగా కనిపిస్తోంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో రమేష్ ఆస్పత్రి వారి కొవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం పది మంది ప్రాణాలను బలితీసుకుంది. దానిమీద చురుగ్గా దర్యాప్తు జరుగుతోంది. విశాఖపట్నం శ్రీచైతన్య కాలేజీలో కొవిడ్ సెంటర్ ఉంటే, పైఫ్లోర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ రెండు ప్రెవేటు యాజమాన్యాల చేతుల్లో ఉన్న భవనాలే. ఇప్పుడు అనంతపురం ప్రభుత్వాస్పత్రిలోనే అగ్నిప్రమాదం జరిగింది. అన్ని ప్రమాదాలకు కారణం షార్ట్ సర్క్యూటే. ప్రాణనష్టంలో తేడా తప్ప.. ప్రమాదం జరిగిన తీరుతెన్నులు, అందుకు కారణమైన నిర్లక్ష్యం అన్ని దుర్ఘటనల్లో ఒకే తీరుగా ఉన్నాయి. ప్రెవేటు యాజమాన్యాలపై కన్నెర్ర చేసిన ప్రభుత్వం.. ప్రభుత్వాస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదానికి ఎవరిని బాధ్యుల్ని చేసి విచారిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.











