వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చలన చిత్రం రూపొందేందుకు రంగం సిద్ధమవుతోంది. జగన్ బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి.. అదిరిపోయే కాంబినేషన్లు సెట్ అవుతున్నాయి. జగన్ అవినీతి వ్యవహారాల మాదిరే ఈ చిత్రం కూడా పాన్ ఇండియా రేంజిలో తెరకుక్కనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరుతో చిత్రంగా మలచిన యువ దర్శకుడు మహీ.వి.రాఘవే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారట. ఎందుకనో గానీ.. వైఎస్ ఫ్యామిలీని చాలా దగ్గర నుంచి చదువుతున్నట్లుగా కనిపిస్తున్న మహీ.. జగన్ కు ఇంకా 50 ఏళ్లు నిండకుండానే ఆయన బయోపిక్ తీసేందుకు సిద్ధపడిపోయారు. అంటే.. 50 ఏళ్లకే ఓ సినిమాకు సరిపడే ఘనతలను జగన్ సాధించేశారన్న మాటేగా. అయితే ఆ మెరుపులతో పాటు చెరిగిపోనివిగా మిగిలిన మరకలను కూడా మహీ తన చిత్రంలో చూపిస్తారో, లేదో చూడాలి.
‘యాత్ర’ డైరెక్టర్.. హర్షద్ మెహతా పాత్రధారి..
ప్రస్తుతం టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహీ.వి.రాఘవ్ ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లుగా సమాచారం. ఈ స్క్రిప్ట్ ను పట్టుకుని జగన్ పాత్రకు సరిపోలే నటుడు ఎవరున్నారన్న దిశగా మహీ చాలా కాలమే వెతికారట. ఈ క్రమంలో హహీకి బాలీవుడ్ లో ఓ రేంజిలో దూసుకెళ్లిన వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’లో కీ రోల్ పోషించిన ప్రతీక్ గాంధీ కంటబడ్డాడట. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ కథేంటో తెలిసిందేగా. యావత్తు దేశాన్ని భారీ కుదుపునకు గురి చేసిన సెక్యూరిటీ కుంభకోణానికి సంబంధించిన కథే అది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న హర్షద్ మెహతా పాత్రలో ప్రతీక్ జీవించారనే చెప్పాలి. ప్రతీక్ అయితేనే జగన్ పాత్రకు సూటవుతాడని కూడా మహీ ఫిక్సయిపోయాడట. ఇంకేముంది.. నేరుగా ముంబై ఫ్లైటెక్కిన మహీ.. ప్రతీక్ ను కలిసి తన స్టోరీని వివరించాడట. ఇప్పటికే ఓ ఆర్థిక నేరగాడి పాత్రలో జీవించేసిన ప్రతీక్… మహీ చెప్పిన జగన్ బయోపిక్ విని తనకు మరో మంచి పాత్ర దొరికిందని ఎగిరి గంతేసినంత పనిచేశాడట. ఏమాత్రం ఆలోచించకుండానే మహీ ప్రాజెక్టుకు ఓకే చేసిన ప్రతీక్.. జగన్ బయోపిక్ లో జగన్ పాత్రలో జీవించేందుకు సిద్ధమైపోయాడట.
ఈ బయోపిక్ లో ఏమేం ఉంటాయో?
ఈ కాంబో చూస్తుంటే.. నిజంగానే కాంబినేషన్ అదిరిపోయినట్టే కదా. బాలీవుడ్ లో అప్పటిదాకా చిన్నా చితక వేషాలతో సరిపెట్టుకున్న ప్రతీప్… స్కామ్ లో హర్షద్ మెహతా పాత్రలో ఒదిగిపోయి ఓ రేంజి అప్లాజ్ దక్కించుకున్నాడు. జగన్ కూడా అంతేగా.. తన తండ్రి సీఎం అయ్యేదాకా జనాలకు పెద్దగా తెలియదు కదా. అయితే ఎప్పుడైతే రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారో.. జగన్ కు ఓ రేంజి ప్రచారం దక్కింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలతో జగన్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వైఎస్సార్ మృతి తర్వాత సీఎం కుర్చీ కోసం పాకులాట, కాంగ్రెస్ అధిష్ఠానంతో తగవు, పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త కుంపటి ఏర్పాటు, అక్రమాస్తుల కేసులో అరెస్ఠు, 16 నెలల జైలు, బెయిల్ పై విడుదల, 2014 ఎన్నికల్లో ఓటమి, 2019 ఎన్నికల్లో ఏకంగా ఏపీలో అధికారం చేపట్టిన తీరు.. ఇలా చెప్పుకుంటూ పోతే… వీటన్నింటిలో జగనఫై నమోదైన అక్రమాస్తుల కేసు హైలెట్ గా నిలుస్తోంది. అంటే.. అక్రమాస్తుల కేసుతో జగన్ నేషనల్ లెవెల్ లో అపకీర్తి మూటగట్టుకున్నారు. జగన్ అవినీతిపై నేషనల్ మీడియాలో ఏ మేర కథనాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పాన్ ఇండియా రేంజే మరి
అంటే.. రీల్ ‘స్కామ్’ హీరోతో ‘రియల్ స్కామ్’ నేత బయోపిక్ అన్నమాట. ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్న జగన్ ను బెయిల్ పై బయట ఉన్న నిందితుడిగానే చెప్పుకోవాలి. సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దుపై ఇప్పుడు విచారణ శరవేగంగా జరుగుతోంది. ఆ బెయిల్ ఎప్పుడైనా రద్దు అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో జగన్ బయోపిక్ అంటూ మహీ తనదైన శైలి యత్నాలు.. అందుకు స్కామ్ స్టార్ ప్రతీక్ ను ఎంచుకోవడం, కరోనా ఉధృతి తగ్గిన వెంటనే చిత్రీకరణకు సిద్ధమవుతున్న తీరు తెలుగు ప్రజలను అమితాసక్తికి గురి చేసేదే. ఇదిలా ఉంటే.. జగన్ బయోపిక్ ను పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కించేందుకు మహీ సన్నాహాలు చేస్తున్నారట. జగన్ మీద రేకెత్తిన ఆరోపణలు కూడా పాన్ ఇండియా రేంజే కదా. అదే సమయంలో స్కామ్ హీరో కూడా పాన్ ఇండియా రేంజి ఉన్న నటుడే. మరి ఇన్ని ఈక్వేషన్లు ఉండగా.. జగన్ బయోపిక్ పాన్ ఇండియా రేంజిని అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
మహీకి పెద్ద పరీక్షే..
ఇదంతా బాగానే ఉన్నా.. వైఎస్సార్ బయోపిక్ లో మహీ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొనలేదనే చెప్పాలి. ఎందుకంటే…. జగన్ మీద ఉన్నన్ని ఆరోపణలు వైఎస్సార్ మీద లేవు. అదే సమయంలో తన అనుకున్న వారి కోసం వైఎస్సార్ ఎంతదాకా అయిన వెళ్లిన తీరును మహీ బాగా ఎలివేట్ చేసి సినిమాను మంచి రేంజిలో సిద్ధం చేసి విడుదల చేశారు. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి అప్లాజ్ కూడా వచ్చిందనే చెప్పాలి. మరి జగన్ లో మెరుపుల కంటే మరకలే ఎక్కువ కదా. ఆ మరకలను మహీ ఎలా డీల్ చేస్తాడన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారిందని చెప్పాలి. సినిమాలో జగన్ నెగెటివ్ షేడ్స్ ను చూపించే సాహసం మహీ చేయగలరా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెగెటివ్ షేడ్స్ లేకుండా, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష లేకుండా జగన్ బయోపిక్కే పూర్తి కాదు. మరి… ఇలాంటి సీన్లను జగన్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఆ సీన్లతో మహీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చూడాలి.
Must Read ;- జగన్ బెయిల్ రద్దు ఖాయం: గోనె ప్రకాశ్ రావు జోస్యం