అపురూప లావణ్యం, అనితరసాధ్యమైన అభినయం కలబోసిన కలల రాణి సౌందర్య. చంద్రబింబం లాంటి మోము, ఎప్పుడూ చిరునవ్వు చిగురించే మోవి.. ఆమె చిరునామా. సౌందర్య చనిపోయి అప్పుడే పదిహేనేళ్ళు అయిపోతోంది. కానీ ఆమె అందాన్ని, అభినయాన్ని దక్షిణాది ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ గ్లామర్ పాత్రలతో పేరు తెచ్చుకోడానికి ప్రాకులాడలేదు. సంసార పక్షమైన పాత్రలతోనే ఆమె టాలీవుడ్ లో నెం.1 హీరోయిన్ గా చక్రం తిప్పింది. అలాంటి చక్కటి నటీమణి పై బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సౌందర్య బయోపిక్ ను తీయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. నిజానికి సౌందర్య జీవితంలో మలుపులు లాంటివేమీ ఉండవు. అలాగే.. పెద్దగా ఎమోషన్స్ కు కూడా తావులేదు. అయినా సరే.. ఈ బయోపిక్ ను తీస్తానంటున్నాడట ఓ దర్శకుడు. ఆ దర్శకుడు ఎవరూ అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సౌందర్య పోలికలు కలిగి.. ఆమె నిజజీవిత పాత్రను తెరమీద పోషించగలిగే సమర్ధవంతమైన నటీమణి ఎవరై ఉంటారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి సౌందర్య గా నటించబోయే నటీమణి ఎవరు, దర్శక నిర్మాతలు ఎవరు అనే సంగతి తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- కరణం మల్లీశ్వరి బయోపిక్ లేనట్టేనా?











