సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో… ప్రత్యేకించి రాయలసీమకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దూకుడు కారణంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. తెలంగాణ నీటిని ఏపీ దోపిడీ చేస్తోందని తెలంగాణ వాదులు విమర్శిస్తుంటే… ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణనే ఏపీకి నీటి వాటాలు అందకుండా చేస్తోందని ఏపీ వాదిస్తోంది. ఈ క్రమంలో ఏపీ వైపు నుంచి ఓ మోస్తరుగానే కౌంటర్లు పడుతుంటే… తెలంగాణ నుంచి మాత్రం పదునైన మాటలే దూసుకువస్తున్నాయి. ఇలాంటి క్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశారు. దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి మృతికి జగన్ తండ్రి, నాడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా కొనసాగిన వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమంటూ సంచలనాలకే సంచలనంగా నిలిచే వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య ఇరు రాష్ట్రాల మధ్య మరింత మేర ఆజ్యం పోయడం ఖాయమనే చెప్పాలి.
గుండె పోటు.. ఆపై ట్రాఫిక్‌లో చిక్కుబడి..
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో… ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో పీజేఆర్ గుండె పోటుకు గురై చనిపోయారు. అసెంబ్లీ ప్రాంగణంలోని జూబ్లీ హాల్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా గుండె పోటుకు గురైన పీజేఆర్‌ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించేందుకు ఆయన అనుచరులు నానా తంటాలు పడ్డారు. అయితే ట్రాఫిక్ మధ్యలో చిక్కుకుపోయిన పీజేఆర్ కారు ముందుకు కదిలే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే పీజేఆర్ కన్నుమూశారు. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలోనే ముగిసింది. అయితే అంతలా పెరిగిపోయిన ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే… ఎవరైనా ఏం చేస్తారన్న కోణంలో నాడు పీజేఆర్ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు తాము సమాధానం చెప్పుకున్నారు. అయితే నాడు జరిగిన ఈ ఘటన వెనుక వైఎస్సార్ కుట్ర ఉందని, పీజేఆర్‌ను కావాలనే వైఎస్సార్ అవమానాలకు గురి చేయడం ద్వారా ఆయనకు గుండె పోటు వచ్చేలా చేశారన్నది తెలంగాణ వాదుల వాదన. ఇదే మాటను ఇప్పుడు శ్రీనివాస గౌడ్ బయట పెట్టారు. అంతేకాకుండా పీజేఆర్‌పై వైఎస్సార్ కక్ష పెంచుకోవడానికి గల కారణాలను కూడా శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
పోతిరెడ్డిపాడును వ్యతిరేకించినందుకే!
రాయలసీమకు న్యాయం చేసేలా వీలయినంత మేర నీటిని తరలించేందుకు వైఎస్సార్ సర్కారు నాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును చేపట్టింది. అయితే పోతిరెడ్డిపాడు నిర్మాణం పూర్తి అయితే… తెలంగాణలోని దక్షిణ ప్రాంతం ప్రత్యేకించి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తీరని నష్టం జరుగుతుందని పీజేఆర్ భావించారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన ఆయన… తమ పార్టీకి చెందిన వైఎస్సార్ అధికారంలో ఉన్నా తన గళాన్ని వినిపించారు. ఈ కారణంగానే పీజేఆర్‌పై వైఎస్సార్ కక్ష పెంచుకున్నారని శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు. ఈ క్రమంలో పలు మార్లు పీజేఆర్‌ను తీవ్ర అవమానాలకు గురి చేసిన వైఎస్సార్.. జూబ్లీ హాల్ సమావేశంలో వేదిక మీదకు ఆహ్వానించకుండా పీజేఆర్‌ను మరింత క్షోభకు గురి చేశారని ఆయన తెలిపారు. ఫలితంగానే పీజేఆర్‌కు గుండెపోటు వచ్చిందని, ఈ క్రమంలో ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే పీజేఆర్ చనిపోయారని గౌడ్ తెలిపారు. మొత్తంగా వైఎస్సార్ కుట్రల కారణంగానే పీజేఆర్ చనిపోయారని, పీజేఆర్ మృతికి ముమ్మాటికీ వైఎస్సారే కారణమని శ్రీనివాస్ గౌడ్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరి ఈ కామెంట్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల మంటలను ఏ స్థాయిలో రగిలిస్తుందోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కేసీఆర్ కామెంట్!.. వైఎస్సార్ ను మించిన మూర్ఖుడు జగన్











