ఏపీ సీఎం జగన్మోహన్మన్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలోని వేమవరం గ్రామ పరిసరాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి కేటాయించిన 3,243 ఎకరాల మైనింగ్ లీజు గడువును పెంచుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మంగళవారం నరసాపురం ఎంపీ రఘురామరాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసుల్లో ఉన్న సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజులు ఎలా పెంచుతారంటూ పిటీషన్‌లో రఘురామరాజు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో మైనింగ్ లీజుల పొగడింపునకు అనుమతి పొందారని ఆయన పిటీషన్‌లో ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. గతంలోనే సరస్వతి పవర్ ఇండస్ట్రీ లీజుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు సీబీఐ నిర్థారించిందని రఘురామరాజు వేసిన పిటీషన్లో పేర్కొన్నారు. సీఎం జగన్ సొంత కంపెనీ కావడంతో అధికారులు నిబంధనలు ఉల్లంఘించి సరస్వతి కంపెనీకి మైనింగ్ లీజుల గడవు పెంచారని రఘురామరాజు పిటీషన్లో వెల్లడించారు. ఈ కేసులో సరస్వతి కంపెనీ, పరిశ్రమల శాఖ, మైనింగ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులను ప్రతివాదులుగా చేర్చారు. ఎంపీ రఘురామరాజు మంగళవారం దాఖలు చేసిన పిటీషన్ త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది.
టీడీపీ హయాంలో రద్దు
2009లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీ పేరుతో సిమెంటు కంపెనీ ఏర్పాటు చేసేందుకు 3,243 ఎకరాల్లో మైనింగ్ లీజులు పొందారు. లీజుకు తీసుకున్న తరవాత ఆరు సంవత్సరాల్లో కంపెనీ ప్రారంభించాల్సి ఉంది. అయితే 2014 ఎన్నికల తరవాత టీడీపీ ప్రభుత్వం సరస్వతి పవర్ ఇండస్ట్రీకు ఇచ్చిన మైనింగ్ లీజులను రద్దు చేసింది. ప్రభుత్వానికి హామీ ఇచ్చిన విధంగా కంపెనీ నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదు. దీంతో 2014లో సరస్వతి పవర్ ఇండస్ట్రీ మైనింగ్ లీజులు రద్దు చేశారు. ఏదైనా కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూ ప్రకారం సకాలంలో ఉత్పత్తి ప్రారంభించకపోతే ఆయా కంపెనీలకు ఇచ్చిన లీజులు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే సరస్వతి సిమెంట్స్ పేరుతో వేలాది ఎకరాలు తీసుకుని, ఇంత వరకు కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించపోవడంతో మైనింగ్ లీజులు రద్దు చేశారు. 2019 ఎన్నికల తరవాత వైసీపీ అధికారంలోకి రావడంతో వెంటనే సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Must Read ;- చిక్కుల్లో జగన్.. వైసీపీ వర్గాల్లో టెన్షన్!